padmavathi: 'పద్మావతి' వివాదం, బెదిరింపుల కారణంగా గ్లోబల్ సమ్మిట్‌కి రాలేకపోతున్న దీపికా పదుకునే!
- 'హాలీవుడ్ టు నోలీవుడ్ టు బాలీవుడ్' అంశం గురించి సమ్మిట్‌లో చర్చ
- ఈ చర్చకు రాలేకపోతున్నానని నిర్వాహకులకు తెలిపిన నటి
- ధోనీ కూడా రావడం లేదని చెప్పిన నిర్వాహకులు
నవంబర్ 28 నుంచి 30వ తేదీ వరకు హైద్రాబాద్‌లో జరగనున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సమ్మిట్‌కి రాలేకపోతున్నట్లు నటి దీపికా పదుకునే నిర్వాహకులకు స్పష్టం చేసింది. పద్మావతి సినిమా వివాదం నేపథ్యంలో వస్తున్న బెదిరింపుల కారణంగా ఆమె ఈ సమ్మిట్‌కి రాలేకపోతున్నట్లు సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రత్యేక అతిథిగా విచ్చేస్తున్న ఈ మూడు రోజుల సమ్మిట్‌లో దాదాపు 53 అంశాల గురించి చర్చించనున్నారు.
అందులో భాగంగా 'హాలీవుడ్ టు నోలీవుడ్ టు బాలీవుడ్' అనే అంశం గురించిన చర్చలో దీపికా పాల్గొనాల్సి ఉంది. నోలీవుడ్ అంటే నైజీరియా దేశ చిత్రపరిశ్రమ. అయితే ఇప్పుడామె హాజరుకాలేకపోతుండటంతో మరొక నటీమణి కోసం వెతికేందుకు సిద్ధమైనట్లు తెలంగాణ ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. అలాగే మరొక అంశానికి సంబంధించిన చర్చలో పాల్గొనాల్సిన క్రికెటర్ ధోనీ కూడా హాజరుకాలేనని చెప్పడంతో ఆ స్థానంలో సానియా మీర్జా, గోపీచంద్‌లను ఎంచుకున్నట్లు ఆయన వెల్లడించారు.