google: గూగుల్ ప్లే స్టోర్‌లో తిరిగి ప్రత్యక్షమైన యూసీ బ్రౌజర్
- కొత్త అప్‌డేటెడ్ సెట్టింగ్స్‌తో అందుబాటులోకి
- తొలగించిన వారం రోజులకే మళ్లీ ప్రత్యక్షం
- కొత్త వెర్షన్‌లో మార్పులు చేశామన్న సంస్థ
గూగుల్ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణంగా ప్లే స్టోర్ నుంచి నిషేధానికి గురైన ప్రముఖ మొబైల్ యాప్ యూసీ బ్రౌజర్... గురువారం రోజు ప్లే స్టోర్‌లో ప్రత్యక్షమైంది. అప్‌డేటెడ్ సెట్టింగ్స్‌తో వచ్చిన ఈ యాప్ గూగుల్ విధివిధానాలకు అనుగుణంగా ఉండేలా మార్పులు చేసినట్లు యూసీ వెబ్ తెలిపింది.
మొబైల్ డేటాను తక్కువ వినియోగించుకునేలా రూపొందించిన యూసీ బ్రౌజర్‌ను ప్రస్తుతం దేశంలో చాలా మంది వినియోగిస్తున్నారు. నెలలో దాదాపు 100 మిలియన్ల మంది యూజర్లు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఈ యాప్ సేవల్లో భాగంగా కొన్ని పెయిడ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోమని ప్రమోట్ చేస్తున్న కారణంగా గూగుల్ ప్లేస్టోర్ దీనిపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అలాంటిదేం లేదని, చిన్న సెట్టింగ్ లోపం కారణంగా గూగుల్ తమపై నిషేధం విధించిందని, ఆ సెట్టింగ్‌ను అప్‌డేట్ చేసిన వెంటనే తమను అనుమతించిందని కంపెనీ వెల్లడించింది.