Gujarath: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మా మద్దతు కాంగ్రెస్‌కే: ఎట్టకేలకు ప్రకటించిన హార్దిక్ పటేల్
- కాంగ్రెస్, పటేల్ వర్గీయుల మధ్య విభేదాలు
- ఓ కొలిక్కి వచ్చిన చర్చలు
- తాము గెలిస్తే పటేల్ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామన్న కాంగ్రెస్
- కాంగ్రెస్, పటేల్ నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు- హార్దిక్ పటేల్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పటేల్ వర్గీయుల నుంచి కాంగ్రెస్ పార్టీకి శుభవార్త అందింది. అసెంబ్లీ సీట్ల ఒప్పందం విషయంలో కాంగ్రెస్, పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి (పాస్) మధ్య విభేదాలు వచ్చిన విషయం తెలిసిందే. పటేల్ వర్గీయులు అడిగినన్ని సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో ఆ పార్టీకి పటేల్ వర్గీయులు మద్దతు ప్రకటిస్తారా? అన్న విషయంపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ఇరు వర్గాల నేతలు చర్చలు జరిపారు.
ఈ రోజు హార్దిక్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు, తమకు మధ్య ఒప్పందం కుదిరిందని చెప్పారు. తమ షరతులకు కాంగ్రెస్ ఒప్పుకుందని తెలిపారు. తమ వర్గానికి రిజర్వేషన్ కల్పించేందుకు కాంగ్రెస్ అంగీకరించిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పటేల్ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెడతామని చెప్పిందని వివరించారు. కాంగ్రెస్, పటేల్ నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, అసెంబ్లీ సీట్ల టికెట్ల గురించి తాము అసలు కాంగ్రెస్‌ను అడగలేదని హార్దిక్ పటేల్ చెప్పుకొచ్చారు. తమ కమ్యూనిటీని విడదీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.