Priyanka vadra: క్రియాశీల రాజకీయాల్లోకి ప్రియాంక.. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి అధిష్ఠించే అవకాశం?
- కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టనున్న ప్రియాంకా వాద్రా?
- రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముందే పగ్గాలు
- రాహుల్ పట్టాభిషేకానికి ఇప్పటికే సిద్ధమైన ముహూర్తం
పూర్వ వైభవం కోసం తపిస్తున్న కాంగ్రెస్ పార్టీలో మార్పులు శరవేగంగా జరుగుతున్నాయి. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు స్వీకరించేందుకు ఇప్పటికే ముహూర్తం సిద్ధం కాగా, తాజాగా ఆయన సోదరి ప్రియాంకా వాద్రాను కూడా క్రియాశీల రాజకీయాల్లోకి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గతంలో రాయబరేలీ, అమేథీల్లో ఆమె ప్రచారం నిర్వహించినప్పుడే క్రియాశీల రాజకీయాల్లోకి ఆమె వస్తారన్న ప్రచారం జరిగింది. ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీతో పొత్తు పొడవడానికి ఒకరకంగా ప్రియాంకనే కారణమన్న ప్రచారం జరిగింది.
అయితే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయంతో ప్రియాంక అరంగేట్రానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఆమె కూడా సైలెంటైపోయారు. అయితే రాహుల్ గాంధీ పట్టాభిషక్తుడు కావడానికి ముహూర్తం ఖరారు కావడంతో ప్రియాంక కూడా పార్టీలో ముఖ్య భూమిక పోషించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆమె పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అంతకంటే ముందే ఆమె పగ్గాలు స్వీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.