satyabhama university: తెలుగు విద్యార్థుల విధ్వంసం.. ఆందోళనల నేపథ్యంలో సెలవులు ప్రకటించిన సత్యభామ యూనివర్సిటీ!
- అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన రాగ రాధ మౌనికారెడ్డి
- చెల్లెలిని కాపాడుకునేందుకు ప్రయత్నించిన సోదరుడ్ని నిబంధనల పేరుతో అడ్డుకున్న సిబ్బంది
- తీవ్ర ఆగ్రహానికి గురై పెనువిధ్వంసం సృష్టించిన విద్యార్థులు
- జనవరి 1 వరకు సెలవులు ప్రకటించిన యూనివర్సిటీ...తక్షణం హాస్టల్స్ విడిచి వెళ్లాలని ఆదేశాలు
తమిళనాడు రాజధాని చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీలో హైదరాబాదుకు చెందిన రాగ రాధ మౌనికారెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె సోదరుడు ఆమె ఆత్మహత్యను ఆపేందుకు ప్రయత్నించినా సిబ్బంది నిర్వాకం కారణంగా దానిని ఆపలేకపోవడంతో ఆగ్రహానికి గురైన తెలుగు విద్యార్థులు, స్నేహితులైన సహవిద్యార్థులతో కలిసి పెను విధ్వంసం సృష్టించారు. తరగతి గదుల్లోని ఫర్నిచర్ ను ద్వంసం చేశారు. వాహనాలకు నిప్పుపెట్టారు.
అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా, వారిని అడ్డుకున్నారు. దీంతో యూనివర్సిటీ యాజమాన్యం దిగివచ్చింది. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయినా విద్యార్థులు శాంతించకపోవడంతో యూనివర్సిటీకి సెలవులు ప్రకటించింది. జనవరి 1 వరకు సెలవులు ఇస్తున్నట్టు తెలిపింది. తక్షణం విద్యార్థులు హాస్టల్స్ ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతో విద్యార్థులు ఇళ్ల బాటపట్టారు.