Women's hockey team: మట్టిల్లే అయినా అది నాకు బొమ్మరిల్లు!: భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్
- భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్
- చిన్నతనంలో మట్టి ఇంట్లో వుండేవారట
- ఏడేళ్లప్పుడే ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం లక్ష్యం
- ఇప్పుడు మంచి ఉద్యోగంలో ఉన్నాను.. మంచి ఇల్లు కూడా ఉంది
భారత మహిళా హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ హర్యానా జట్టు తరపున గత వారం హాకీ పోటీలో పాల్గొని రాష్ట్ర జట్టును విజేతగా నిలిపింది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ, రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం గతంలో తనకు రాలేదని, ప్రస్తుతం టోర్నీలు లేకపోవడంతో గత కొన్నేళ్లుగా తనను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర జట్టుకు ఆడాలని నిర్ణయించుకున్నానని, తన సారథ్యంలో జట్టు విజయం సాధించడం ఆనందంగా వుందని తెలిపింది.
అసలు హాకీ క్రీడలోకి రావాలన్న ఉద్దేశమే తనకు వుండేది కాదని, తన బాల్యం మొత్తం పేదరికంలో గడిచిందని తెలిపింది. ఏడేళ్ల వయసులో ఉండగా ఏదైనా ఆటలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందని ఎవరో చెప్పారని, తన మనసులో అది నాటుకుపోయిందని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులను బాగా చూసుకోవడమే తనకు లక్ష్యంగా ఉండేదని తెలిపింది.
దీంతో ఏదైనా ఆటలో రాణించి ఉద్యోగం సంపాదించాలని అప్పుడు నిర్ణయించుకున్నానని తెలిపింది. ఏ ఆట ఆడినా బాగా ఆడేదానినని తెలిపింది. అలా ఆడి 14 ఏళ్ల వయసులో భారత మహిళల హాకీ జట్టుకు ఎంపికయ్యానని చెప్పింది. మొదటి కోచ్ సర్దార్ బల్బీర్ సింగ్ తర్వాత భారత మహిళల కోచ్ ఎమ్కే కౌశిక్ తన ఆటలో ప్రత్యేకతను గుర్తించారని, తాను భారత జట్టుకు ఎంపిక అయ్యేందుకు ఆయనే ప్రధాన కారకులని తెలిపింది.
తరువాత ఆటుపోట్లను ఎదుర్కొన్న తాను ప్రస్తుతం మంచి ఉద్యోగంలో కొనసాగుతున్నానని చెప్పింది. దీంతో ఆర్థికంగా చాలా మెరుగయ్యామని తెలిపింది. మంచి ఇల్లు కూడా కట్టుకున్నానని చెప్పింది. తన తల్లిదండ్రులు తనతోనే ఉంటున్నారని చెప్పిన రాణి రాంపాల్... కొత్త ఇల్లు వచ్చినా తాను పుట్టి పెరిగిన మట్టి ఇంటిని వదిలే ఆలోచన లేదని తెలిపింది. అది మట్టి ఇల్లే అయినా తనకు బొమ్మరిల్లని చెప్పింది. వీలైనప్పుడు ఆ ఇంటికి వెళ్తానని, అప్పుడు చిన్నతనం గుర్తుకొస్తుందని తెలిపింది.