raj kandukuri: ఆ కథను ఎంతగా తిరస్కరించానో .. 'మెంటల్ మదిలో' కథను అంతగా ఇష్టపడ్డాను: రాజ్ కందుకూరి
- వివేక్ ఆత్రేయ మొదట ఒక కథ చెప్పాడు .. నచ్చలేదన్నాను
- వారం రోజుల్లోనే రెండో కథ రెడీ చేసుకుని వచ్చాడు
- కథ విన్నాక .. ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పాను
రాజ్ కందుకూరి నిర్మించిన 'మెంటల్ మదిలో' .. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఐ డ్రీమ్స్ తో రాజ్ కందుకూరి పంచుకున్నారు. " 'పెళ్లి చూపులు' విడుదలైన తరువాత షార్ట్ ఫిల్మ్స్ చేసిన చాలామంది నా దగ్గరికి వచ్చి కథలను వినిపిస్తూ ఉండేవారు. అలా ఒక రోజున వివేక్ ఆత్రేయ తన దగ్గర ఓ కథ ఉందంటూ వచ్చాడు .. ఇద్దరం కాఫీ షాప్ లో కూర్చున్నాం. పొయెటిక్ ఫీలింగ్ తెచ్చే 'కావ్యం' అనే ఓ కథ చెప్పాడు".
"అంతటి భావుకతను ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు .. ఇప్పట్లో ఈ సినిమా చేయలేను అని చెప్పాను. అలా వెళ్లిపోయిన వివేక్ ఆత్రేయ వారం రోజుల తరువాత .. మరో కథ వుందని చెబితే రమ్మని చెప్పాను. చేతిలో ఎలాంటి స్క్రిప్ట్ లేదు .. చెప్పడం మొదలుపెట్టాడు. ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఆపేసి .. మర్నాడు మళ్లీ అదే సమయానికి రమ్మన్నాను. ఈ లోగా ఆ తరువాత ఏం జరిగివుంటుందోనని ఆలోచించుకున్నాను. మర్నాడు వచ్చి మిగతా కథ వినిపించాడు. అక్కడే ఆయనతో ఓ సెల్ఫీ తీసుకుని .. నా నెక్స్ట్ డైరెక్టర్ అని పోస్ట్ చేశాను .. అంతే" అంటూ చెప్పుకొచ్చారు.