assam: పాపాలు చేసిన వారికే కేన్సర్ వస్తుంది: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అసోం మంత్రి
- దేవుడు అందర్నీ శిక్షిస్తాడని వ్యాఖ్యలు చేసిన ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ
- కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులకు బోధన చేసిన మంత్రి
- విరుచుకుపడి విమర్శలు చేస్తున్న ప్రతిపక్షం
మనుషులు చేసిన పాపాలన్నీ ఏకమై కేన్సర్‌గా పరిణామం చెందుతాయని అసోం ఆరోగ్య మంత్రి హిమంత బిస్వా శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆరోగ్య మంత్రిగా విఫలమైనందుకే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులను ఉద్దేశిస్తూ శర్మ ఈ వ్యాఖ్యలు చేశారు.
'బాధ్యతల నుంచి తప్పించుకోవడం పెద్ద పాపం. అలాంటి వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. పాపాలు చేయడం వల్ల కేన్సర్ రావడం, యాక్సిడెంట్లలో చనిపోవడం జరుగుతాయి' అని శర్మ అన్నారు. పాఠశాలకు గైర్హాజరవుతూ బాధ్యతలను తప్పే ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
శర్మ చేసిన వ్యాఖ్యలు కేన్సర్‌తో బాధపడుతున్న వారి మనోభావాలను తీవ్రంగా దెబ్బతీశాయని, ఈ వ్యాఖ్యల కారణంగా వారు మరింత కుంగిపోయే అవకాశం ఉందని ప్రతిపక్షాలు విమర్శించాయి. దీనిపై శర్మ స్పందిస్తూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. సైన్సుని, ఆధ్యాత్మికతను పోల్చి చూస్తున్నవారితో తానేం మాట్లాడలేనని, ఒక హిందూగా కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, బహుశా చేసిన పాపాల కారణంగానే తన తండ్రి కేన్సర్‌తో చనిపోయి ఉంటాడని శర్మ అభిప్రాయపడ్డారు.