BJP: బీజేపీ ఎంపీకి లీగల్ నోటీస్ పంపించాను!: ప్రకాశ్ రాజ్
- కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న సినీనటుడు
- ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా విమర్శలు
- ఆయన మాటలు నా వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేశాయి: ప్రకాశ్ రాజ్
- నాకు ఆయన సమాధానం చెప్పాలి
అవకాశం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న నటుడు ప్రకాశ్‌రాజ్‌పై బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. బెంగళూరులో గౌరీలంకేశ్ హత్య జరిగినప్పుడు ఓ వర్గం వారు సంబరాలు జరుపుకుంటున్నారని, దీనిపై ప్రధానమంత్రి మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రకాశ్ రాజ్ నిలదీసిన విషయం తెలిసిందే.
అలాగే, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీపై విమర్శలు, హిందువులను తీవ్ర వాదులతో పోల్చడం వంటి వ్యాఖ్యలను ప్రకాశ్‌రాజ్ చేశారు. కొన్ని రోజుల క్రితం ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ ప్రతాప్‌సింహా.. ప్రకాశ్‌రాజ్ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. మోదీతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ప్రకాశ్‌రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఈ ఏడాది అక్టోబర్ 2న సింహా ఓ ట్వీట్ చేశారు. కుమారుడు మృతి చెందిన వెంటనే భార్యను వదిలేసి, ఓ డ్యాన్సర్ వెనకాల వెళ్లిపోయిన ప్రకాశ్‌రాజ్‌కు మోదీ, యోగీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ఆయన అన్నారు.
దీనిపై స్పందించిన ప్రకాశ్ రాజ్.. తానొక మంచి నటుడినని, మోదీ నటిస్తోంటే తాను ఆ విషయాన్ని గుర్తించలేనని అనుకుంటున్నారా? అని అన్నారు. తాను ఓ నటుడినన్న గౌరవం అయినా తనకు ఇవ్వండని, ఎందుకంటే తాను ఏది సత్యమో ఏది నటనో గుర్తించి మాట్లాడగలనని పేర్కొన్నారు. దీంతో అక్టోబర్ 3న ప్రతాప్ సింగ్ మళ్లీ ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. 'కన్నడలో నీ పేరు ప్రకాశ్‌రాయ్, తమిళంలో ప్రకాశ్‌రాజ్ నీ అవసరాన్ని బట్టి ప్రతి రాష్ట్రంలో పేరు మార్చుకుంటున్నావు' అని పేర్కొన్నారు.
తాజాగా ప్రతాప్‌సింహా వ్యాఖ్యలపై స్పందించిన ప్రకాశ్‌రాజ్... ప్రతాప్‌సింహా చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత జీవితాన్ని డిస్టర్బ్ చేశాయని అన్నారు. సదరు బీజేపీ నేతకు తాను లీగల్ నోటీసులు పంపానని, ప్రతాప్ సింహా చేసిన వ్యాఖ్యలపై జవాబు ఇవ్వాలని, లేకపోతే ఆయనపై క్రిమినల్ కేసులు వేస్తానని ప్రకాశ్ రాజ్ అన్నారు.