kothapalli geetha: అకౌంటులో డబ్బులు వేయాలంటూ.. ఎంపీ కొత్తపల్లి గీతకు బెదిరింపు మెయిల్స్!
- వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఫిర్యాదు వచ్చిందంటూ మెయిల్ లో పేర్కొన్న దుండగుడు
- వివరాలు కావాలంటే అకౌంట్ లో డబ్బులు వేయాలంటూ డిమాండ్
- పోలీసులను ఆశ్రయించిన గీత
విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు ఓ ఆంగతుకుడు బెదిరింపు ఈమెయిల్స్ పంపాడు. ఆ మెయిల్స్ లో తనను తాను ఏసీబీ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. మీ వ్యక్తిగత ఆస్తులు, బ్యాంకు లావాదేవీలపై ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని... సంబంధిత ఫైల్ ఏసీబీ కార్యాలయంలో ఉందని... వివరాలు కావాలంటే తన ఎస్బీఐ అకౌంట్ లో డబ్బులు వేయాలంటూ మెయిల్స్ లో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో, ఆమె ద్వారక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. విశాఖ పోలీస్ కమిషనర్ ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తనకే కాక ఇలాంటి మెయిల్స్ చాలా మంది ఎంపీలకు వస్తున్నాయని ఈ సందర్భంగా గీత అన్నారు. ఇటీవల తన కుమారుడి అకౌంట్ నుంచి రూ. 12 వేలు మాయమయ్యాయని... ఇది జరిగి ఎనిమిది నెలలైనా బ్యాంకు నుంచి ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్, ఫేక్ మెయిల్స్ పై బ్యాంకులు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పార్లమెంటు సమావేశాల్లో సైబర్ క్రైమ్ అంశాన్ని తాను లేవనెత్తుతానని తెలిపారు. ఈ ఘటనలను కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళతానని చెప్పారు.