Chandrababu: చంద్రబాబు పాలనలో అంతా గోవిందా.. గోవిందా!: జగన్
- అప్పట్లో తొమ్మిదేళ్లు అసమర్థపాలన చేశారు
- చంద్రబాబు పాలన ముగియగానే వైఎస్సార్ పాలన వచ్చింది
- ఎంతో లాభం చేకూరింది
- ఇప్పుడు మళ్లీ చంద్రబాబు వచ్చి సీన్ రిపీట్ చేస్తున్నారు
చంద్రబాబు నాయుడి పరిపాలనలో అప్పట్లోనూ నష్టపోయామని, ఇప్పుడూ నష్టపోతున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పాదయాత్రను కొనసాగించిన జగన్.. అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతూ... 'చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే పేదలకు అందే పథకాలు, ఇళ్లు, సబ్సిడీలు, భూములు ఇవన్నీ అందడం లేదు. అప్పట్లో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నందుకు తెలుగు ప్రజలు ఏం చూశారు? అప్పటివరకు ఉన్న మద్య నిషేధం గోవిందా... రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం గోవిందా... ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు గోవిందా...
'ప్రభుత్వ రంగ సంస్థలన్నీ గోవిందా... వ్యవసాయం గోవిందా.. చంద్రబాబు ఆ సీటులో కూర్చుంటే వర్షాలు గోవిందా.. ఇళ్ల నిర్మాణం, పెన్షన్లు గోవిందా.. చంద్రబాబు పాలన వెళ్లిపోగానే నాన్నగారు, మన ప్రియతమ నేత దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. రాగానే మళ్లీ ప్రజల్లో ఆనందం నిండింది. విద్యుత్ బకాయిల రద్దు జరిగిపోయింది... ఫీజు రీయింబర్స్ మెంట్ వచ్చింది.. పిల్లలందరూ చదువుకున్నారు.. ఎప్పుడూ లేని విధంగా 24 లక్షల ఇళ్లు కట్టి రికార్డు సృష్టించారు.. చంద్రబాబు సీఎం కుర్చీనుంచి తప్పుకోగానే నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మితమయ్యాయి' అని జగన్ వ్యాఖ్యానించారు.
'చంద్రబాబు కుర్చీ నుంచి తప్పుకుంటేనే ఇవన్నీ సాధ్యమయ్యాయి. 108 అంబులెన్సులు కుయ్ కుయ్ అంటూ వచ్చాయి. పేదలకు ఉచిత వైద్యం, ఆరోగ్య శ్రీ లభించింది. మన కర్మ కొద్దీ చంద్రబాబు నాయుడు మళ్లీ 2014లో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు. మళ్లీ పేదల కష్టాలు మొదలయ్యాయి. రైతులకు న్యాయం జరగడంలేదు, విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోయాయి. మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కుర్చీనుంచి దిగిపోతేనే అందరి కళ్లలో ఆనందం నిండుతుంద'ని జగన్ వ్యాఖ్యానించారు. మళ్లీ మంచి రోజులు కావాలంటే చంద్రబాబును అధికారం నుంచి దింపాలని జగన్ కోరారు.