Andhra Pradesh: ఐదంతస్తుల ఆర్ అండ్ బీ బిల్డింగ్‌ను నాలుగు నెలల్లో అతికించేశారు.. నేడు ప్రారంభించనున్న చంద్రబాబు!
- నాలుగు నెలల్లో 5 అంతస్తుల బిల్డింగ్ పూర్తి
- ప్రీకాస్ట్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న దేశంలోనే తొలి ప్రభుత్వ భవనం
- భవిష్యత్ నిర్మాణలకు దిక్సూచిగా మారనున్న ఆర్ అండ్ బీ కార్యాలయం
‘ఇల్లు కట్టిచూడు.. పెళ్లి చేసి చూడు’ అని పెద్దలు ఊరికే అన్లేదు. పెళ్లి సంగతి అటుంచినా, ఇల్లు కట్టాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమైన పనే. డబ్బు, శ్రమ, కాలం.. ఈ మూడింటినీ బాగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక చిన్నచిన్న నిర్మాణాలు పూర్తి చేయాలన్నా ఏళ్ల సమయం పట్టేస్తోంది. అయితే ఇకపై కాలాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం రాకుండా ‘ప్రీకాస్ట్’ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. దీనిని ఉపయోగించి విజయవాడలో నిర్మించిన ఆర్ అండ్ బీ ప్రధాన కార్యాలయం భవిష్యత్ నిర్మాణాలకు దిక్సూచిగా మారింది.
విజయవాడ నడిబొడ్డున రూ.101 కోట్లతో నిర్మించిన ఆర్ అండ్ బీ భవనాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు. ఐదంతస్తులతో అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ భవన నిర్మాణానికి పట్టిన కాలమెంతో తెలుసా? జస్ట్ నాలుగు నెలలు. వినడానికి కొంత ఆశ్చర్యంగా కనిపించినా ఇది నిజం.
ఇటుకపై ఇటుక పేర్చి కట్టే విధానానికి స్వస్తి చెప్పిన ఆర్ అండ్ బీ అధికారులు ప్రీకాస్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ప్రభుత్వ భవనాన్ని ఇలా ప్రీకాస్ట్ టెక్నాలజీతో నిర్మించడం దేశంలో ఇదే తొలిసారి. ప్రికా సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. గతేడాది నవంబరు 9న భూమి జరిగింది. మొత్తం 2.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు.
భవన నిర్మాణానికి అవసరమైన పిల్లర్ల నుంచి శ్లాబులు, గోడలు, మెట్లు, బీమ్‌లు.. ఇలా అన్నింటినీ ప్రీకాస్ట్ పద్ధతిలో ముందే తయారుచేసి పెట్టుకున్నారు. పిల్లర్లు తీసి ఒకదానిపై ఒకటి పెట్టి అతికించేశారు. అనంతరం ఫినిషింగ్ వర్క్ పూర్తి చేసి రంగులేశారు. అంతే.. ఐదంతస్తుల బిల్డింగ్ నాలుగు నెలల్లో అద్భుతంగా తయారైంది. భవన నిర్మాణం కోసం ఇద్దరు ఇంజినీర్లు, 12 మంది ఎరెక్షన్ సిబ్బంది పనిచేశారు. వీరందరూ స్థానికులే కావడం గమనార్హం.
నిర్మించాల్సిన భవనం కొలతల ప్రకారం ముందుగానే పిల్లర్లు, ఫ్లోరింగ్ శ్లాబులు, మెట్లు తదితర వాటిని హైదరాబాద్‌లో ఉన్న యూనిట్లో ప్రికా సంస్థ తయారు చేసింది. అనంతరం వాటిని విజయవాడకు తరలించి అతికించింది. ఈ పనులకు నాలుగు నెలలు పట్టగా ప్లాస్టిరింగ్, ఇంటీరియర్, విద్యుత్, ప్లంబింగ్ పనులకు మరో 8 నెలలు పట్టింది. అంటే ఏడాదిలో ఐదు అంతస్తుల భవనాన్ని సిద్ధం చేసేశారన్న మాట.