venumadhav: నేను కాలు మీద కాలేసుకుని కూర్చోవడం ఒక పెద్ద హీరోకి నచ్చలేదు: హాస్యనటుడు వేణుమాధవ్
- కాలుమీద కాలేసుకుని కూర్చోవడం నాకు అలవాటు
- ఆ విషయం గురించి ఓ పెద్ద హీరో అడిగారు
- అది తప్పెలా అవుతుందని అడిగాను
- ఆ సమాధానం కూడా ఆయనకి నచ్చలేదు
ఐ డ్రీమ్స్ తో వేణుమాధవ్ మాట్లాడుతూ .. ఒక సినిమా షూటింగులో తనకి ఎదురైన ఒక అనుభవాన్ని గురించి చెప్పుకొచ్చారు. " నేను ఒక సినిమా షూటింగుకి వెళ్లినప్పుడు ఆ సినిమా చేస్తోన్న ఓ పెద్ద హీరో నన్ను పిలిచారు. "ఏవయ్యా నువ్ కాలు మీద కాలేస్తావట గదా?" అని అడిగారు. "ఎవరు చెప్పారు మీకు ఆ విషయం" అని అడిగాను. "నేను ప్రూవ్ చేస్తాను ఆ విషయం" అంటూ ఎవరికో ఫోన్ చేస్తున్నారు.
ఆయనను అడ్డుకుంటూ "విషయమేంటో స్పష్టంగా చెప్పండి సార్" అన్నాను. "నువ్ కాలుమీద కాలేసుకుని కూర్చుంటావట గదా!" అన్నారు. " నేను ఎవరి కాలుమీద కాలేసి కూర్చోను సార్ .. నా కాలుమీద నా కాలేసుకుని కూర్చుంటాను .. అది తప్పెలా అవుతుంది సార్?" అన్నాను.
దాంతో రెండు నిమిషాల పాటు ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత "నువ్ మాట్లాడేది కరెక్ట్ కాదయ్యా .. సరే నీ ఇష్టం అలాగే కానీ " అన్నారు. "ఏం చేస్తాం .. అది నా అలవాటు .. ఆ తరువాత కూడా ఆ హీరోతో సినిమాలు చేశాను" అంటూ వేణుమాధవ్ చెప్పుకొచ్చారు.