padmavathi movie: బ్రిటన్ సెన్సార్ బోర్డుకు ‘పద్మావతి’ సెగ... నిరసనకు రాజ్ పుత్ ల సన్నాహం!
- విడుదలకు బ్రిటన్ సెన్సార్ బోర్డు లైన్ క్లియర్
- నో కటింగ్స్... 12ఎ రేటింగ్
- నిరసనకు లండన్ లోని రాజ్ పుత్ వర్గీయుల సన్నాహం
పద్మావతి వివాదం బ్రిటన్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో పద్మావతి పాత్రపై రాజ్ పుత్ వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు దిగడంతో సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. కానీ, బ్రిటన్ సెన్సార్ బోర్డు దీనికి లైన్ క్లియర్ చేయడంతో లండన్ లోని రాజ్ పుత్ లు తమ నిరసన తెలిపేందుకు ఉద్యుక్తులవుతున్నట్టు సమాచారం.
పద్మావతి సినిమాకు ఏ విధమైన కత్తెరలు విధించకుండా ఉన్నది ఉన్నట్టుగానే సినిమా విడుదల చేసుకునేందుకు బ్రిటిష్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ క్లాసిఫికేషన్ (బీబీఎఫ్ సీ) పచ్చ జెండా ఉపింది. పద్మావతి సినిమా ఓ మోస్తరు హింసతో మాత్రమె ఉందని పేర్కొంటూ 12ఎ రేటింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఎటువంటి కటింగ్ లు లేకుండా అనుమతిస్తున్నట్టు సెన్సార్ బోర్డు తెలిపింది. 12ఎ రేటింగ్ అంటే బ్రిటన్ వ్యాప్తంగా ఈ సినిమాను 12 ఏళ్లలోపు పిల్లలు పెద్దలతో పాటు వెళ్లి మాత్రమే చూడచ్చు.