padmavathi: 'పద్మావతి' వివాదంలో కొత్త మలుపు... కోటగోడకు ఉరి వేసుకున్న యువకుడు!
- 'పద్మావతి' సినిమా విడుదల అడ్డుకోవాలంటూ వ్యక్తి ఆత్మహత్య
- జైపూర్ లోని నహర్ గఢ్ కోటకు వేలాడుతున్న మృతదేహం
- తలలు నరకడం లేదు, ప్రాణత్యాగం చేస్తున్నా
'పద్మావతి' సినిమా వివాదం సరికొత్త మలుపులు తిరుగుతోంది. 'పద్మావతి' సినిమా విడుదల నిలిపివేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా జైపూర్ లోని నహర్ గఢ్ కోటకు యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది.
ఈ సందర్భంగా సదరు యువకుడు రాసిన సూసైడ్ నోట్ లో 'తామెవరి తలలు నరకడం లేదని, ప్రాణత్యాగం చేస్తామ'ని పేర్కొన్నాడు. అయితే దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు ఉరి వేసుకున్నాడా? లేక శవాన్ని తెచ్చి ఎవరైనా ఉరివేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని రాజ్ పుత్ కర్ణి సేన తెలిపింది.
ఈ ఘటన నేపథ్యంలో పద్మావతి సినిమా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ, టైటిల్ పాత్రధారి దీపికా పదుకునే లకు భద్రత పెంచారు. వారి నివాసం వద్ద పోలీసులను మోహరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో ఈ సినిమాపై మరో వ్యాజ్యం దాఖలైంది. పద్మావతి సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ రాకముందే జర్నలిస్టులకు ప్రదర్శించారని చెబుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వచ్చే బుధవారం విచారణ జరుగనున్నట్టు తెలుస్తోంది.