dinakaran: రెండాకుల గుర్తును తిరిగి సాధించుకుంటా.. శపథం చేసిన దినకరన్
- ‘రెండాకుల గుర్తు’ పళనిస్వామి వర్గానికేనని ఈసీ స్పష్టం
- ఆర్కే నగర్ ఉప ఎన్నిక.. వచ్చేనెల 21న పోలింగ్
- బహిరంగ సభలో మాట్లాడిన దినకరన్
- ఎన్నికల్లో గెలుస్తామని ధీమా
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక పోలింగ్ వచ్చేనెల 21న నిర్వహించనున్నారు. అన్నాడీఎంకే పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో ‘రెండాకుల గుర్తు’ తమకే కావాలంటూ ఆ పార్టీ బహిష్కృత నేత దినకరన్, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వర్గాలు పోటీ పడ్డాయి. చివరికి ఆ గుర్తును పళనిస్వామి వర్గానికే కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం దినకరన్‌కు మింగుడు పడడం లేదు.
ఈ క్రమంలో ఈ రోజు దినకరన్ ఓ ప్రతిజ్ఞ చేసి శశికళను గుర్తు తెచ్చారు. తిరుర్పూర్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దినకరన్ మాట్లాడుతూ తాను ‘రెండాకుల గుర్తు’ను సొంతం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో తాను విజయం సాధిస్తానని అన్నారు. జైలుకి వెళ్లే ముందు శశికళ కూడా ఇటువంటి ప్రతిజ్ఞ చేసిన దృశ్యాలు అప్పట్లో మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే.