Hyderabad: మెట్రో రైలులో కింద కూర్చున్నారో... కఠినమైన నిబంధనలు.. కచ్చితంగా పాటించాల్సిందే!
- మెట్రో ఎక్కాలంటే నిబంధనలు తెలిసి ఉండాల్సిందే
- వ్యక్తిగత బ్యాగేజీ 10 కిలోలకు మించకూడదు
- టికెట్ తీసుకున్న 2.30 గంటలలోపు గమ్యానికి చేరుకోవాల్సిందే
మరో రెండు రోజుల్లో మెట్రో కూత పెట్టనుంది. తొలి ప్రయాణ అనుభవం కోసం నగరవాసులు సిద్ధమవుతున్నారు. అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వస్తున్న మెట్రో రాజధాని ప్రజల ట్రాఫిక్ కష్టాలను ఎంత వరకు తీరుస్తుందో కానీ రైలెక్కడానికి మాత్రం బోల్డన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. విమానాశ్రయంలో ఉండేలాంటి ఆంక్షలు ఉన్న మెట్రోలో అవి ఎంతవరకు అమలవుతాయో వేచి చూడాల్సిందే. మెట్రోలో ఎక్కాలంటే ప్రయాణికులు విధిగా పాటించాల్సిన నిబంధనలు ఏమిటో చూద్దాం..
ప్రజా సౌకర్యార్థం మెట్రోలో కఠినమైన ఆంక్షలు అమలు చేయనున్నారు. మెట్రోలో సీట్లు పరిమితంగా ఉంటాయి కాబట్టి రద్దీ సమయాల్లో సీట్ల మధ్య ఉండే ఖాళీ ప్రదేశాల్లో కూర్చుంటామంటే కుదరదు. ఒకవేళ కూర్చుంటే జరిమానా చెల్లించుకోకతప్పదు. సీటుంటే కూర్చోవాలి. లేదంటే నిల్చోవాలి. వ్యక్తిగత బ్యాగేజీ పది కిలోలకు మించకూడదు. నిర్దేశిత బరువు దాటితే కిలోకు రూపాయి చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట బరువు 40 కిలోలు. మోసుకెళ్లే బ్యాగు పొడవు 60 సెంటీమీటర్లు, వెడల్పు 45, ఎత్తు 25 సెంటీమీటర్లకు మించకూడదు.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి కౌంటర్లలో టికెట్ తీసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు ప్రయాణికులకు తక్షణం టికెట్లు అందించేందుకు పోర్టబుల్ టికెట్ అనలైజర్ (పీటీఏ) యంత్రంతో స్టేషన్ సిబ్బంది అందుబాటులో ఉంటారు.
మెట్రో స్టేషన్‌ను పబ్లిక్ ఏరియా, ప్రైవేట్ ఏరియా, ప్లాట్‌ఫామ్‌లుగా విభజించారు. పబ్లిక్ ఏరియాలోకి ఎవరైనా వెళ్లొచ్చు. ప్రైవేటు ఏరియాలోకి వెళ్తే రైలు ఎక్కడానికి టోకెన్ తీసుకోవాలి. తీసుకున్న దగ్గరి నుంచి సమయం కౌంట్ అవుతుంది. ప్రైవేట్ ఏరియాలో టోకెన్ తీసుకున్నాక 29 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఆలోగానే ప్లాట్‌ఫాంపైకి వెళ్లాలి. టోకెన్ తీసుకున్న 2.30 గంటలలోపే గమ్యస్థానం చేరుకోవాల్సి ఉంటుంది. నిషేధిత జాబితాలో ఉన్న వస్తువులను తీసుకొచ్చే వారిని రైలులోకి అనుమతించరు.