Team India: భారత జట్టుకు కోచ్ కావాలనుకున్నా.. కానీ జరిగింది మరోటి!: గంగూలీ
- జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదు
- కోచ్ కావాలనుకుని ‘క్యాబ్’ అధ్యక్షుడినయ్యా
- గుర్తు చేసుకున్న టీమిండియా మాజీ సారథి
జీవితం ఎటువైపు వెళ్తుందో, మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవరికీ తెలియదని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. ఆటగాడిగా రిటైరయ్యాక భారత జట్టుకు కోచ్ కావాలని అనుకున్నానని, కానీ తప్పనిసరి పరిస్థితుల్లో బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడినయ్యానని దాదా వివరించాడు. తన జీవితంలో జరిగిన అనుకోని సంఘటనల గురించి గంగూలీ మాట్లాడుతూ 1999లో ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు తాను భారత జట్టులో ఆటగాడిని మాత్రమేనని, కనీసం వైస్ కెప్టెన్ను కూడా కానని చెప్పుకొచ్చాడు. అప్పుడు జట్టుకు సచిన్ కెప్టెన్గా ఉన్నాడని, కానీ మూడు నెలల తర్వాత తాను కెప్టెన్ను అయ్యానని వివరించాడు.
క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకున్నాక భారత జట్టుకు కోచ్ కావాలని ఆశించానని, అయితే దాల్మియా కారణంగా ‘క్యాబ్’లోకి రావాల్సి వచ్చిందన్నాడు. దాల్మియా తనను పిలిచి ఆరు నెలలు బెంగాల్ క్రికెట్ అసియేషన్లో ఉండమన్నారని గుర్తు చేసుకున్నాడు. ఆయన చనిపోయినప్పుడు క్యాబ్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ఎవరూ రాకపోతే తాను చేపట్టాల్సి వచ్చిందని తెలిపాడు. సాధారణంగా ఆ బాధ్యతలు చేపట్టడానికి కనీసం 20 ఏళ్లు అయినా పడుతుందని, కానీ తనకు క్రికెట్ నుంచి తప్పుకున్న వెంటనే వచ్చిందని దాదా వివరించాడు.