London: లండన్‌ను బెంబేలెత్తించిన కాల్పుల పుకారు.. పోలీసుల ఉరుకులు పరుగులు!
- నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో కలకలం సృష్టించిన కాల్పుల వార్త
- పరుగులు పెట్టిన ప్రజలు.. దుకాణాల మూసివేత
- గంటపాటు వెతికి ఏమీ లేదని తేల్చిన పోలీసులు
శుక్రవారం లండన్ పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. కాల్పుల వార్తతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. లండన్‌లోని అత్యంత రద్దీగా ఉండే ఆక్స్ఫర్డ్ సర్కస్ సబ్వే స్టేషన్ వద్ద కాల్పులు జరిగినట్టు వచ్చిన వార్తలతో ప్రజలు వణికిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉరుకులు పరుగులతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే గంట తర్వాత ఆ వార్త ఉత్తిదేనని పోలీసులు తేల్చారు. కాల్పులకు సంబంధించి వచ్చిన వార్తలు వాస్తవం కాదని, అటువంటిదేమీ జరగలేదని, అనుమానితులు కానీ, బాధితులు కానీ ఎవరూ లేరని తేల్చి చెప్పారు.
జిట్టెరీ సిటీ ఏడాది మొత్తం రద్దీగా ఉంటుంది. వివిధ రకాల షాపులతో కిక్కిరిసిపోయి ఉంటుంది. ఇక్కడ రద్దీగా ఉండడంతో ఉగ్రవాదులు దీనిని టార్గెట్‌గా మార్చుకుంటున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు దాడులు జరిగాయి. తాజాగా శుక్రవారం ఆక్స్ఫర్డ్ సర్కస్ స్టేషన్లో పలుమార్లు కాల్పులు జరిగినట్టు వార్తలు వ్యాపించడంతో షాపింగ్ కొచ్చినవారు భయంతో పరుగులు తీశారు. సమీపంలోని స్టోర్లు, ఇళ్లలోకి దూరి తలదాచుకున్నారు. దుకాణాలు మూసేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. గంటపాటు గాలించారు. అయితే అనుమానితులు కానీ, బాధితులు కానీ కనిపించకపోవడంతో కాల్పుల వార్త ఉత్తిదేనని తేల్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.