archbishop: జాతీయవాదుల బారి నుంచి దేశాన్ని కాపాడండి... క్రైస్తవులకు పిలుపునిచ్చిన గాంధీనగర్ ఆర్చ్‌బిషప్
- చర్చిలు, ఫాదర్లు ఇనిస్టిట్యూట్ల మీద దాడి చేస్తున్నారంటూ ఆరోపణ
- గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ప్రకటన జారీ
- మొదట్నుంచి కాంగ్రెస్‌కి మద్దతిస్తున్న గుజరాత్ క్రైస్తవులు
గుజరాత్లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఎవరికి తోచిన విధంగా వారు ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా గత నాలుగేళ్లుగా ఏకఛత్రాధిపత్యంగా గెలుస్తున్న బీజేపీకి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇదిలా ఉండగా గుజరాత్‌లోని క్రైస్తవ కమ్యూనిటీని ఆలోచించి ఓటు వేయాలని కోరుతూ గాంధీనగర్‌కి చెందిన ఆర్చ్‌బిషప్ థామస్ మాక్వన్ జారీ చేసిన ప్రకటన ఒకటి ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్‌గా మారింది.
'జాతీయవాదుల బారి నుంచి దేశాన్ని కాపాడటంలో సహాయం చేయండి. ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించే వారిని ఎన్నుకోండి. దేశభవితవ్యంలో గుజరాత్ ఎన్నికలు ప్రముఖ పాత్ర పోషించనున్నాయి. భారత రాజ్యాంగానికి విశ్వాసంగా ఉండే అభ్యర్థిని ఎన్నుకోండి. దేశంలో ఎక్కడో ఓ చోట చర్చిల మీద, మత సంబంధిత కార్యాలయాల మీద ప్రతిరోజూ దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్య, లౌకిక విధాన పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో తెలుస్తూనే ఉంది. అందుకే తోటి క్రైస్తవులుగా ఒకసారి ఆలోచించండి' అనేది ప్రకటన సారాంశం.
థామస్ మాక్వన్ సంతకంతో నవంబర్ 21న ఈ ప్రకటన జారీ అయినట్లు తెలుస్తోంది. గుజరాత్ జనాభాలో 2-3 శాతం ఉన్న క్రైస్తవులు మొదట్నుంచి కాంగ్రెస్‌కి మద్దతు పలుకుతున్నారు. ఇలాంటి సమయంలో ఆర్చ్‌బిషప్ ప్రకటన ఎలాంటి ప్రభావం చూపించనుందో మరి!