sbi: అన్ని సేవలకు ఒకటే యాప్... యోనో యాప్‌ను ఆవిష్కరించిన ఎస్బీఐ!
- యాప్‌ని ప్రారంభించిన అరుణ్ జైట్లీ
- ఖాతా తెరవడం నుంచి షాపింగ్ వరకు అన్ని సేవలకూ ఒకటే యాప్
- ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ వినియోగదారుల కోసం ఒక కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యోనో (యూ నీడ్ ఓన్లీ వన్) పేరుతో ఉన్న ఈ యాప్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవిష్కరించారు. ఆన్లైన్లో బ్యాంకు ఖాతాను తెరవడం, లావాదేవీలు, రుణాల దరఖాస్తులు, ఆన్లైన్ షాపింగ్ వంటి ఎన్నో సేవలు ఈ యాప్ ద్వారా అర్జించవచ్చు.
అంతేకాకుండా ఎస్బీఐ అనుబంధ సంస్థలైన ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ జనరల్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ క్యాప్స్, ఎస్బీఐ కార్డ్స్ వంటి ఆర్థిక పథకాలన్నీ ఈ యాప్‌తో అనుసంధానమై ఉంటాయి. ఆధార్ నంబరు, వన్ టైమ్ పాస్వర్డ్ ద్వారా పనిచేసే ఈ యాప్ ఒక రకంగా డిజిటల్ బ్యాంకులాంటిదేనని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ తెలిపారు. వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు కల్పించేందుకు 60కి పైగా ఈ–కామర్స్ సంస్థలతో ఎస్బీఐ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.