elephants: ఏనుగులు రైల్వే ట్రాక్ మీదకు రాకుండా ఉండేందుకు కృత్రిమ తేనెటీగల శబ్దం!
- మార్గాల్లో పరికరాలు పెట్టిన ఈశాన్య సరిహద్దు రైల్వే
- ప్రయత్నం ఫలించిందన్న రైల్వే అధికారులు
- రైళ్లు ఢీకొని చనిపోతున్న ఏనుగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం
రైల్వే మార్గాలను దాటుతూ ఏనుగులు మృత్యువాత పడటాన్ని తగ్గించేందుకు ఈశాన్య సరిహద్దు రైల్వే ఓ వినూత్న పద్ధతిని అమలు చేసింది. ఏనుగులకు సహజ శత్రువైన తేనెటీగల శబ్దాన్ని కృత్రిమంగా సృష్టించడం ద్వారా వాటిని రైల్వే ట్రాక్ దరిదాపుల్లోకి రాకుండా చేశారు. 2016లో దాదాపు 16, ఈ ఏడాది ఆరు ఏనుగులు ట్రాక్ దాటుతూ మృత్యువాత పడ్డాయి.
ఏనుగులకు భారీ శరీరం ఉన్నప్పటికీ తేనెటీగలంటే చాలా భయపడ్తాయి. వాటి శరీరంలో సున్నితమైన భాగమైన తొండం మీద కుడతాయేమోనని ఏనుగులు, తేనెటీగలకు దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తాయి. కృత్రిమంగా తేనెటీగల శబ్దాన్ని సృష్టించే ఈ పరికరాలను ఏనుగుల సంచారం ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాల్లో అమర్చారు. ఒక్కో పరికరానికి రూ. 2000లు ఖర్చయింది. వీటిని అమర్చిన చోటి నుంచి 600 మీటర్ల పరిధిలో ఉన్న ఏనుగులకు శబ్దం వినపడుతుంది.