puja: మాపై అంతటి వికృత జోకు వేస్తే యాంకర్ అనసూయ, జడ్జిలు గట్టిగా నవ్వారు: బాలిక ఆవేదన
- 24 గంటల్లో మాకు న్యాయం చేయాలి
- దీనిని సహించేది లేదు
- మంత్రికి కూడా ఫిర్యాదు చేశాం
- హైపర్ ఆది వ్యాఖ్య విని మనోవేదనకు గురయ్యాం
'జబర్దస్త్' కామెడీ షో లో అనాథ పిల్లలను ఉద్దేశించి వికృత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ షో నటులు, జడ్డిలు, యాంకర్ అనసూయ తమకు క్షమాపణలు చెప్పాల్సిందేనని అనాథ ఆశ్రమ విద్యార్థులు, ప్రజా హక్కుల పరిరక్షణ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కామెడీ షోలో స్క్రిప్ట్ రైటర్, నటుడు హైపర్ ఆది చేసిన దారుణ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఈ రోజు అనాథాశ్రమ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
ఫిర్యాదు చేసిన పూజ అనే అమ్మాయి మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 23న రాత్రి ప్రసారమైన జబర్దస్త్ షో లో హైపర్ ఆది చేసిన వికృత వ్యాఖ్యను ఖండిస్తున్నామని తెలిపింది. తాము ఆ షో చూసి, తమపై ఇంతటి దారుణ వ్యాఖ్యను విని మనోవేదనకు గురయ్యామని తెలిపింది. హైపర్ ఆది ఒకరకంగా తమ తల్లిదండ్రులను అవమానించాడని చెప్పింది. హైపర్ ఆది ఏదో గొప్ప జోక్ వేసినట్లు యాంకర్ అనసూయ, జడ్జిలు నాగబాబు, రోజా గట్టిగా నవ్వారని చెప్పింది.
తమపై చేసిన కామెడీకి వారంతా ఇలా నవ్వుతున్నారని, దీనిని సహించేది లేదని తెలిపింది. తాము తెలంగాణ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారికి ఫిర్యాదు చేశామని చెప్పింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అనాథ పిల్లలు ప్రభుత్వ పిల్లలని అన్నారని, తమపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన వారిపై, వికృతంగా నవ్వినవారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. 24 గంటల్లో తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది.