Chandrababu: టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు శంకుస్థాపన.. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి అందుబాటులోకి

  • తెల్లవారుజామున 5.17 గంటలకు శంకుస్థాపన
  • నాలుగు బ్లాకులుగా నిర్మాణం
  • హాజరైన నేతలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు

ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించతలపెట్టిన తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ఉదయం శంకుస్థాపన చేశారు.  గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 5.17 గంటలకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అలాగే సీఎం నివాసం పక్కనే నిర్మించిన గ్రీవెన్స్ హాలును కూడా సీఎం ప్రారంభించారు.

పార్టీ కార్యాలయాన్ని మొత్తం నాలుగు బ్లాకులుగా నిర్మించనున్నారు. 3.60 ఎకరాల విస్తీర్ణంలో మూడు భవనాలుగా నిర్మిస్తారు. పరిపాలనా భవనాన్ని జీ+4 అంతస్తులతో నిర్మించనుండగా, ఐదో అంతస్తులో పార్టీ జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి కార్యాలయాలు, 4వ అంతస్తులో పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శుల కార్యాలయాలు వుంటాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు.  

రాష్ట్రం విడిపోయాక ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను మొత్తం అమరావతి కేంద్రంగానే నిర్వహిస్తున్నారు. ఎప్పుడో ముఖ్యమైన సమయాల్లో తప్ప హైదరాబాద్ రావడం లేదు. దీంతో అక్కడి పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ బోసిపోయింది. తెలంగాణ నేతలు అప్పుడప్పుడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్పితే, ఏపీ నేతలు ఆ వైపుగా కూడా రావడం లేదు. దీనికి తోడు రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఏపీలో పార్టీ ఆఫీస్ అవసరం కావడంతో జాతీయ కార్యాలయం నిర్మించాలని నిర్ణయించారు. అందులో భాగంగానే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో దీని నిర్మాణాన్ని చేపట్టారు. కాగా, తాజాగా నిర్మించతలపెట్టిన పార్టీ కార్యాలయాన్ని వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

  • Loading...

More Telugu News