YSRCP: నాడు బుగ్గనకు, నేడు కంగాటికి... డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి రెండోసారి షాకిచ్చిన వైఎస్ జగన్!
- పత్తికొండలో కేఈపై పోటీకి కంగాటి శ్రీదేవి
- 2014 ఎన్నికల్లో డోన్ నుంచి కేఈపై బుగ్గన పేరు ముందే వెల్లడి
- నేడు జగన్ 18వ రోజు ప్రజా సంకల్ప యాత్ర
2014లో అసెంబ్లీ ఎన్నికలకు ఎంతో ముందు డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున కేఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉండగా, ఆయనపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీకి దిగుతారని ఎన్నో నెలల ముందే ప్రకటించిన వైఎస్ జగన్ అప్పట్లో సంచలనానికే తెరదీశారు. ఇక తాజాగా, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న కేఈ కృష్ణమూర్తి పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండగా, ఆయనపై కంగాటి శ్రీదేవిని బరిలో దించనున్నట్టు ఏడాది ముందే ప్రకటించిన వైఎస్ జగన్, కేఈకి మరోమారు షాకిచ్చారు.
నిన్న తన ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా కృష్ణగిరిలో నిర్వహించిన సభలో, పత్తికొండ నుంచి వైకాపా తరఫున శ్రీదేవిని నిలుపుతున్నట్టు వైఎస్ జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమెను మంచి మెజారిటీతో గెలిపించాలని కూడా జగన్, ప్రజలను కోరారు. ప్రజలు అడుగడుగునా దివంగత నేత నారాయణరెడ్డిని గుర్తు చేసుకుంటూ, జగన్ కు నీరాజనాలు పలుకుతున్న వేళ, ఆయన సతీమణినే తమ పార్టీ తరఫున నిలబెడుతున్నట్టు ప్రకటించారు.
అంతకుముందు ఆయన యాత్ర దాదాపు 16 కిలోమీటర్లు సాగగా, ప్రజలతో మమేకమవుతూ, వారిని ఆప్యాయంగా పలకరిస్తూ, జగన్ ముందుకు సాగారు. ఈ ప్రాంతంలో టీడీపీ నాయకుల అరాచకాలు పెరిగిపోయాయని పలువురు వైకాపా నేతలు స్థానిక పరిస్థితులను జగన్ దృష్టికి తేగా, మరో ఏడాది ఓపికపడితే, అన్ని సమస్యలూ సద్దుమణుగుతాయని భరోసా ఇచ్చారు.
తమకు ఏ పథకం ద్వారా కూడా లాభం లేకుండా చేస్తున్నారని, వైకాపాలో ఉన్న కారణంగానే ఇలా జరుగుతోందని వారు జగన్ కు వివరించారు. తమకు మరుగుదొడ్లు లేవని, పింఛన్ ఇవ్వడం లేదని, ఉపాధి కరవైందని పలువురు ఫిర్యాదు చేయగా, వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. కాగా, జగన్ ప్రజాసంకల్ప యాత్ర, 18వ రోజు షెడ్యూల్ లో భాగంగా నేడు, రామకృష్ణాపురం నుంచి వెంకటగిరి వరకూ జగన్ నడవనున్నారు.