Delhi: ఢిల్లీ విమానాశ్రయంలో విదేశీ మహిళ హల్‌చల్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు!
- బిగ్గరగా కేకలు వేస్తూ అధికారులతో వాగ్వాదం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- నార్వే రాయబార కార్యాలయానికి సమాచారం
ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ హల్‌చల్ చేసింది. బిగ్గరగా కేకలు వేస్తూ గందరగోళం సృష్టించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నార్వేకు చెందిన పెనసెంకో ఒలీనా తమ దేశం వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెక్-ఇన్ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పెద్దగా అరుస్తూ నానా రభస చేసింది. దీంతో సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. ఆమె ప్రవర్తన అసాధారణంగా ఉండడంతో అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అదుపులోకి తీసుకున్న ఆమెను చికిత్స కోసం సప్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్టు చెప్పారు.
పెనసెంకో ఒలీనాను అదుపులోకి తీసుకున్న విషయాన్ని నార్వే దౌత్య కార్యాలయానికి తెలియజేసినట్టు అధికారులు తెలిపారు. ఒలీనాను పరీక్షించిన వైద్యులు ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు చెప్పారు. ఈనెల 10న వీసాపై వచ్చిన ఆమె మానసిక స్థితి సరిగా లేకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.