Russia: సిరియాలో రష్యా వైమానిక దాడులు.. 34 మంది పౌరులు మృతి!
- ఐసిస్ అధీనంలో ఉన్న చివరి ప్రాంతంపై రష్యా వైమానిక దాడులు
- మృతుల్లో 15 మంది చిన్నారులు
- ఉగ్రవాదుల ఏరివేతలో సిరియాకు సాయం అందిస్తున్న రష్యా
సిరియాలో రష్యా జరిపిన వైమానిక దాడుల్లో 34 మంది పౌరులు మృతి చెందారు. వీరిలో 15 మంది చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు డీర్ ఎజార్ ప్రావిన్స్‌లో ఆదివారం ఈ దాడులు నిర్వహించారు. ఐసిస్ ఉగ్రవాదుల అధీనంలో ఉన్న చివరి ప్రాంతం ఇదే.
సిరియాలో ఉగ్రవాదుల చెరలో ఉన్న ప్రాంతాలను ఇప్పటికే స్వాధీనం చేసుకున్న సైన్యం వారిని దేశం నుంచి పూర్తిగా వెళ్లగొట్టేందుకు కంకణం కట్టుకుంది. అందులో భాగంగానే రష్యాతో కలిసి వైమానిక దాడులకు దిగింది. సిరియాలో తమ ఉనికికి ప్రమాదం ఏర్పడడంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి తమ సొంత దేశాలకు పయనమవుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. గత రెండేళ్లుగా సిరియాతో రష్యా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తోంది. అందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేతలో ఆ దేశానికి సాయం అందిస్తోంది.