Marco Marais: 96 ఏళ్లు భద్రంగా ఉన్న రికార్డును బద్దలుగొట్టిన దక్షిణాఫ్రికా క్రికెటర్!
- 191 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ
- 200 నుంచి 300 పరుగులకు చేరుకోవడానికి 52 బంతులు మాత్రమే ఆడిన వైనం
- ఆస్ట్రేలియా ఆటగాడు మెక్ కార్ట్నీ రికార్డు గల్లంతు
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ నమోదైంది. దక్షిణాఫ్రికా ఆటగాడు మార్కో మరైస్ 191 బంతుల్లోనే త్రిశతకం బాది ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. సన్ఫోయిల్ త్రీ-డే కప్లో భాగంగా ఆదివారం బోర్డర్-ఈస్టర్న్ ప్రావిన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో మార్కో ఈ రికార్డు నెలకొల్పాడు. కేవలం 191 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా తన పేరును లిఖించుకున్నాడు. అంతేకాదు 96 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు గొట్టాడు.
బోర్డర్ జట్టు తరపున బరిలోకి దిగిన మార్కో ఆరో నంబరు ఆటగాడిగా బరిలోకి దిగాడు. 84 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో చిక్కుకున్న సమయంలో క్రీజులోకి వచ్చిన మార్కో ఫోర్లు, సిక్సర్లతో చెలరేగాడు.191 బంతులు ఎదుర్కొని 35 ఫోర్లు, 13 సిక్సర్లతో 300 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ మెక్ కార్ట్నీ 1921 సాధించిన రికార్డును బద్దలుగొట్టాడు. మెక్ కార్ట్నీ 221 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ చేశాడు. కాగా, 68 బంతుల్లో సెంచరీ చేసిన 24 ఏళ్ల మార్కో 200 నుంచి 300 పరుగులకు చేరుకోవడానికి కేవలం 52 బంతులు మాత్రమే ఆడడం గమనార్హం.