Sushil Modi: లాలు కుమారుడి హెచ్చరికలు.. తనయుడి పెళ్లి వేదికను మార్చుకున్న ఉప ముఖ్యమంత్రి!
- పెళ్లి మండపం నుంచి వరుడిని ఈడ్చుకొచ్చి నానా బీభత్సం సృష్టిస్తానని హెచ్చరించిన తేజ్ ప్రతాప్
- అతడు ఎలాంటి వాడో అందరికీ తెలుసన్న సుశీల్ మోదీ
- ఇంత పిరికి డిప్యూటీ సీఎం ప్రజలకు ఏం రక్షణ కల్పిస్తారన్న లాలు ప్రసాద్
లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ హెచ్చరికల నేపథ్యంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత సుశీల్ మోదీ తన కుమారుడి పెళ్లి వేదికను మార్చుకున్నారు. సుశీల్ మోదీ కుమారుడి పెళ్లిని అడ్డుకుంటానంటూ గతవారం తేజ్ ప్రతాప్ చేసిన హెచ్చరికలు వైరల్ అయ్యాయి. ఈ హెచ్చరికల నేపథ్యంలో సుశీల్ మోదీ తన కుమారుడి వివాహ వేదికను రాజేంద్రనగర్‌లోని శక మైదాన్ నుంచి వెటర్నరీ కాలేజ్ గ్రౌండ్స్‌కు మార్చారు.
వేదిక మార్పుపై సుశీల్ మోదీ మాట్లాడుతూ ఈ వివాహం రాజకీయాలకు అతీతంగా జరగాలన్న ఉద్దేశంతోనే వేదికను మార్చినట్టు చెప్పారు. తేజ్ ప్రతాప్ ఎటువంటి వాడో తెలుసు కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తన కుమారుడి హెచ్చరికలను లాలూ ఖండించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
సుశీల్ మోదీ కుమారుడి వివాహంపై తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ.. సుశీల్ మోదీ తన కుమారుడి వివాహానికి తనను ఆహ్వానించారని, తాను వెళ్తే అక్కడ విధ్వంసం జరుగుతుందని అన్నారు. తాను పెళ్లికి వెళ్తే మోదీ కుమారుడిని బయటకు ఈడ్చుకువచ్చి వివాహ వేదికపైనే బహిరంగ సభ నిర్వహిస్తానని, అక్కడి వస్తువులను ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సుశీల్ వివాహ వేదికను మార్చారు.
పెళ్లి వేదిక మార్పుపై తేజ్ ప్రతాప్ స్పందిస్తూ తాను క్రిమినల్‌నో, ఉగ్రవాదినో కానని, సుశీల్ మోదీ తన కుమారుడి వివాహాన్ని భయం లేకుండా జరుపుకోవచ్చని అన్నారు. పబ్లిక్ మీటింగ్‌లో తాను చెప్పింది వ్యక్తిగతంగా చూపించబోనని అన్నారు. లాలు ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ.. ఇంత పిరికిగా వ్యవహరించే డిప్యూటీ సీఎం ప్రజలకు ఏం భద్రత కల్పిస్తారని దెప్పిపొడిచారు. కాగా, మోదీ కుమారుడి వివాహానికి పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు హాజరుకానున్నారు.