indigo: చరిత్రకారుడు రామచంద్ర గుహను అవమానించిన ఇండిగో!
- వారం రోజుల వ్యవధిలో మూడు అవమానాలు
- ఏ ఎయిర్ పోర్టులోనైనా ఇండిగో తీరు ఇదే
- విమర్శించిన చరిత్రకారుడు రామచంద్ర గుహ
ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహను దేశవాళీ ఎయిర్ లైన్స్ ఇండిగో ఉద్యోగులు అవమానించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. ఇప్పటివరకూ తన పట్ల ఇండిగో ఉద్యోగులు మూడుసార్లు ఎయిర్ పోర్టుల్లో అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఒకే ఎయిర్ లైన్స్ కు చెందిన ఉద్యోగులు వేరువేరు విమానాశ్రయాల్లో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారని, ఇది తనకు దిగ్భ్రాంతిని కలిగించిందని అన్నారు.
వాస్తవానికి ఏవైనా ఫిర్యాదులు చేసేందుకు తాను ట్విట్టర్ ను వాడుకోబోనని, అయితే, వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు అనుచితంగా ప్రవర్తించిన ఇండిగో వైఖరిని నలుగురికీ తెలియజేయాలనే ఈ పని చేశానని అన్నారు. తన స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా ఇండిగో ఉద్యోగుల ప్రవర్తన సరిగ్గా ఉండటం లేదని ఫిర్యాదు చేశారని అన్నారు.
ప్రయాణికులపై దాడులు చేయడం, అనుచితంగా ప్రవర్తించడంలో యునైటెడ్ ఎయిర్ లైన్స్, ఇండిగో ఒకే విధంగా ప్రవర్తిస్తున్నాయని, భవిష్యత్తులో ఈ రెండు సంస్థలూ విలీనమై చరిత్ర సృష్టించేలా ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాగా, ఈ నెల 7వ తేదీన ఓ ప్యాసింజర్ ను ఇండిగో ఉద్యోగులు కొడుతున్న వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.