jc diwakar reddy: జగన్ మా వాడే... వాడు, వీడు అంటూనే ఉంటా: జేసీ
- రాజకీయ నేతగా జగన్ అభిప్రాయాలకు వ్యతిరేకం
- మానసికంగా మాత్రం దగ్గరే
- పాదయాత్ర వేస్ట్
- జ్యోతిలక్ష్మి నడిచినా జనం చూస్తారన్న జేసీ
ఓ రాజకీయ పార్టీ నేతగా వైఎస్ జగన్ అభిప్రాయాలను తాను విభేదించినప్పటికీ, జగన్ తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకడేనని, ఆయన కుటుంబం తనకెంతో దగ్గరని తెలుగుదేశం నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ను తాను వాడు, వీడు అని సంబోధిస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
జగన్ చేస్తున్న పాదయాత్రతో ఆయన బలం పెరిగిందని భావించాల్సిన అవసరం లేదని, రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడుస్తున్నా చూసేందుకు ప్రజలు వస్తారని ఎద్దేవా చేశారు. అనంతపురంలో తనను అడ్డుకునేందుకు ఎన్నో దుష్ట శక్తులు అడుగడుగునా వెంటాడుతున్నాయని, వాటిల్లో అధికార పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని, తాను మాత్రం వారి కోరలు పీకేసి తన దారిన తాను వెళుతుంటానని చెప్పారు.
ప్రజల్లో చెడు అభిప్రాయాన్ని తెచ్చుకునేందుకు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి తనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రహదారి విస్తరణ పనుల వల్ల ఆయనకు నష్టం జరగదని, ఇంకా చెప్పాలంటే లాభమే కలుగుతుందని అన్నారు. ప్రజలకు వ్యతిరేకంగా పోవడం ప్రభాకర్ దురదృష్టమని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతటా కలుషిత రాజకీయాలే నడుస్తున్నాయని జేసీ అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్నట్టుగా ఎమ్మెల్యేలు ఇప్పుడు లేరని, ఎవరో ఒకరు మాత్రమే దిగజారారని చెప్పలేమని, అలసత్వం, లంచగొండితనం, ప్రజలకు దూరంగా ఉండటం ఎమ్మెల్యేలకు నిత్యకృత్యమైందని ఆరోపించారు.