saudi arabia: వారి అంతం మొదలైంది.. భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తాం: సౌదీ యువరాజు
- దుబాయ్ లో జరిగిన తొలి 'ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోయెలేషన్' సమావేశం
- టెర్రరిజం వల్ల ముస్లింలకు చెడ్డ పేరు వస్తోంది
- తీవ్రవాదం అంతానికి అంతా కలసి పోరాడుదాం
ఇస్లామిక్ టెర్రరిజంపై సౌదీ అరేబియా ఉక్కుపాదం మోపబోతోంది. ఉగ్రవాదాన్ని సమూలంగా తుదముట్టిస్తామని... ఇప్పటికే వారి అంతం మొదలైందని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తెలిపారు. ఉగ్రవాదాన్ని భూమ్మీద లేకుండా తుడిచిపెట్టేస్తామని అన్నారు. నిన్న దుబాయ్ లో సౌదీ అరేబియా యువరాజు అధ్యక్షతన ఇస్లామిక్ మిలిటరీ కౌంటర్ టెర్రరిజం కోయెలేషన్ (ఐఎంసీటీసీ) తొలి అత్యున్నత సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదం కారణంగా ముస్లిం సమాజానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. ఇకపై అలా జరగడానికి వీల్లేదని... టెర్రరిజాన్ని పూర్తిగా అంతం చేసేందుకు మనమంతా కలసికట్టుగా పోరాడాలని తెలిపారు. మరోవైపు ఇస్లామిక్ మిలిటరీ కూటమిలో ఇరాన్, ఇరాక్, సిరియాలు సభ్యులుగా లేవు. సౌదీ అరేబియాతో ఉన్న దౌత్యపరమైన విభేదాల కారణంగా ఈ సమావేశానికి ఖతార్ హాజరుకాలేదు.