Cricket: టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్!
- 54 టెస్టు మ్యాచుల్లో 300 వికెట్లు తీసిన అశ్విన్
- 300 టెస్ట్ వికెట్లు తీసిన 31వ బౌలర్‌గా అశ్విన్
- ఈ ఏడాది 50వ టెస్టు వికెట్ కూడా అశ్విన్ ఖాతాలో
నాగ్‌పూర్ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగించాడు. టెస్ట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. నిన్నటి వరకు ఈ ఘనత ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ ఖాతాలో ఉండేది. నాగ్‌పూర్ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో అశ్విన్ 67 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్‌లోనూ నాలుగు వికెట్లు తీసి 63 పరుగులు ఇచ్చాడు.
ఆస్ట్రేలియా బౌలర్ డెన్నిస్ లిల్లీ మొత్తం 56 మ్యాచుల్లో 300 వికెట్లు తీయగా, అశ్విన్ 54 టెస్టు మ్యాచుల్లో 300 వికెట్లు తీశాడు. అంతేకాదు, టెస్టుల్లో 300 వికెట్లు తీసిన భారత ఆరో స్పిన్నర్ గా అశ్విన్ నిలిచాడు. 300 టెస్ట్ వికెట్లు తీసిన ప్రపంచ 31వ బౌలర్‌గా అశ్విన్ రికార్డులోకి ఎక్కాడు. అలాగే, ఈ ఏడాది 50వ టెస్టు వికెట్‌ను కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకుని మరో మైలురాయిని చేరుకున్నాడు. దీంతో ఈ ఏడాది అత్యధిక టెస్టు వికెట్లు సాధించిన రెండో స్పిన్నర్‌గా అశ్విన్ నిలిచాడు.
అలాగే, వరుసగా మూడు ఏళ్లు (2015, 2016, 2017) 50 వికెట్ల చొప్పున తీసిన మొదటి టీమిండియా బౌలర్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా చూస్తే, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్‌వార్న్, శ్రీలంక మాజీ ఆటగాడు ముత్తయ్య మురళీధరన్ తరువాత ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా అశ్విన్ రికార్డుల్లోకి ఎక్కాడు. అశ్విన్ 2015లో 62, 2016 లో 72 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఇప్పటికే 50 వికెట్లు తీసిన అశ్విన్.. ఈ ఏడాది ముగిసేనాటికి మరో ఐదారు వికెట్లను తీసే అవకాశం ఉంది.