twitter: ఈ ట్వీట్ తనను టచ్ చేసిందన్న మంత్రి కేటీఆర్.. హర్షం వ్యక్తం చేసిన నాని!
- కేటీఆర్, నటుడు నానిలను రోల్ మోడల్స్‌గా చూపుతూ వ్యక్తిత్వ వికాస నిపుణుడు స్పీచ్
- నేటి రాజకీయనాయకులు కూడా రోల్ మోడల్స్ అంటూ కేటీఆర్‌కి ట్వీట్ చేసిన నెటిజన్
- హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్, నాని
ఇప్పటి యువత ఎటువంటి వారిని తమ రోల్ మోడల్‌గా తీసుకుంటారు?.. లాల్ బహదూర్ శాస్త్రీ, గాంధీజీ, అబ్దుల్ కలాం లాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఇప్పటి వారిని రోల్ మోడల్‌గా తీసుకోవాలంటే కనుక.. కిరణ్‌బేడీ, క్రికెటర్ సచిన్, స్వయం కృషితో ఎదిగిన నటుడు చిరంజీవి లాంటి వారిని యువత ఎంచుకోవచ్చు. ఒకప్పటి రాజకీయ నాయకులకు, ఇప్పటి నాయకులకు ఎంతో తేడా ఉందని, ఇప్పటి రాజకీయ నాయకులను ఇప్పట్లో రోల్ మోడల్స్‌గా తీసుకునే అవకాశం లేదని అనుకుంటారు.
అందుకే, వ్యక్తిత్వ వికాస నిపుణులు కూడా ఇప్పటి రాజకీయ నాయకులను రోల్ మోడల్‌గా తీసుకోవాలని చెప్పరనే భావం అందరిలోనూ ఉంది. అయితే, నేటి రాజకీయ నాయకుడు కేటీఆర్‌ను, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన సినీనటుడు నానిని రోల్ మోడల్‌గా చూపుతూ ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడు ఓ చోట స్పీచ్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్‌కి తెలియజేసి, ఇప్పటి రాజకీయ నాయకులను కూడా రోల్‌మోడల్‌గా తీసుకోవచ్చని తెలుసుకుని ఆశ్చర్యం వ్యక్తం చేశానని తెలిపాడు.
యువత రోల్ మోడల్‌గా తీసుకోవడానికి కేటీఆర్ అర్హుడని ఆ నెటిజన్ తెలిపాడు. ఈ ట్వీట్ పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యక్తిత్వ వికాస తరగతి ఎక్కడ జరిగిందో కానీ, తనను టచ్ చేసిందని అన్నారు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు చూపిస్తోన్న రెండు ఫొటోల్లో ఒకటి తానైతే, మరో ఫొటోలో నాని కూడా ఉన్నాడని పేర్కొంటూ కేటీఆర్.. నానికి ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన నాని కూడా హర్షం వ్యక్తం చేశాడు. 'సేమ్ హియర్ బ్రదర్' అని కేటీఆర్‌తో అన్నాడు. నెటిజన్లను ఈ ట్విట్టర్ సంభాషణ అలరిస్తోంది.