apcc: పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కి పేటెంట్ హక్కు ఉన్నట్లే!: ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి
- ఓవరాల్ ప్రాజెక్ట్ 32 శాతం మేమే పూర్తి చేశాం
- మా ప్రభుత్వం ఉండి ఉంటే ఇప్పటికే పూర్తిగా పనులు అయిపోయేవి
- కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
- 2018 కల్లా ప్రాజెక్ట్ పూర్తికావాలి
పోలవరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌కి పేటెంట్ హక్కు ఉన్నట్లేనని ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఓవరాల్ ప్రాజెక్ట్ 32 శాతం, కుడి కాలువ 80 శాతం, ఎడమ కాలువ 44 శాతం, పర్యావరణ అనుమతులు 90 శాతం పూర్తి అయ్యాయని తెలిపారు. 2014లోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే కేంద్రప్రభుత్వ నిధులతో ఈ పాటికి పోలవరం పూర్తి చేసేవారమని చెప్పుకొచ్చారు.
టీడీపీ ప్రభుత్వం ఎస్టిమేషన్ పంపటానికే మూడున్నరేళ్లు పట్టిందని, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గు ఉందా? అని ఆయన అన్నారు. కాసుల కక్కుర్తి కోసం, కమీషన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళారీ పాత్ర పోషించారని వ్యాఖ్యానించారు. డబ్బులు ఇవ్వకుంటే ప్రాజెక్టులు ఎలా పూర్తి అవుతాయని, రాష్ట్ర ఖజానా మీద భారం కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అన్నారు. 2018 కల్లా ప్రాజెక్ట్ పూర్తికావాలని డిమాండ్ చేశారు.