ivanka trump: ఇవాంకా ట్రంప్ షెడ్యూల్ ఇదే!
- మంగళవారం వేకువ జాము 3 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్
- ఔటర్ మీదుగా హోటల్ వెస్టిన్ కు చేరిక
- మధ్యాహ్నం 3 గంటలకు సదస్సుకు హాజరు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె, ఆయన ప్రత్యేక సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాదులో ఈ నెల 28 నుంచి 30 వరకు నిర్వహించనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల పాటు హైదరాబాదులో ఉండే ఆమె అధికారిక షెడ్యూల్ ఖరారైంది.
దాని వివరాల్లోకి వెళ్తే... మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైటెక్ సిటీలో ఆమె బస చేయనున్న వెస్టిన్ హోటల్ కు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల వరకు హోటల్ లో రెస్ట్ తీసుకుని 3 గంటలకు హెచ్ఐసీసీలో సదస్సుకు చేరుకుంటారు. 3 గంటల నుంచి 4:25 నిమిషాల వరకు సదస్సులో పాల్గొంటారు. అనంతరం 4:25 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. 5:50 నిమిషాలకు ఆమె తిరిగి హోటల్ కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు ఫలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాని ఇచ్చే విందులో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి రాత్రి 10:40 నిమిషాలకు హోటల్ కు చేరుకుంటారు.
29వ తేదీన ఉదయం పది గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని సదస్సులో పాల్గొంటారు. తిరిగి 11 గంటలకు హోటల్ కు చేరుకుని, సాయంత్రం ఐదు వరకు హోటల్ లో ఉంటారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా శంషాబాద్ చేరుకుంటారు. ఇవాంక తిరిగే ప్రాంతాల్లో ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి 60 మంది భద్రతా సిబ్బంది ఆమెతో పాటు రానున్నారు. తొలి అంచెలో వారుంటారు. తరువాతి అంచెలో ఇంటెలిజెన్స్ అధికారులు, ఆ తరువాతి అంచెలో కూడా అమెరికా భద్రతాధికారులుంటారు. తరువాతి రెండు అంచెల్లో ఎన్ఐఏ, హైదరాబాదు భద్రతాధికారులు ఆమె భద్రతను పరిరక్షిస్తారు. వీరంతా సమన్వయంతో పని చేస్తారు.