v6: అందుకే వీ6 'తీన్మార్' బిత్తిరి సత్తిపై దాడి చేశాడట!
- బిత్తిరి సత్తిపై మణికంఠ దాడి
- ఉన్మాదిగా అనుమానం
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఆ ఛానెల్ తెలంగాణకు, దేశానికి వ్యతిరేకమని విచిత్ర వ్యాఖ్యలు
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ వీ6లో 'తీన్మార్' వార్తలతో ప్రేక్షకుల్ని అలరిస్తోన్న బిత్తిరి సత్తిపై ఈ రోజు ఓ వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అతడి పేరు మణికంఠ అని తెలిపారు.
వీ6 ఛానెల్ తెలంగాణ భాష, యాసలోనే వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే, ఆ వ్యక్తి మాత్రం ఆ ఛానెల్‌పై ఆరోపణలు చేస్తున్నాడు. వీ6 తెలంగాణకు వ్యతిరేకమని మణికంఠ విచిత్రంగా మాట్లాడుతున్నాడు. తాను బిత్తిరి సత్తిని కొట్టడానికే అక్కడకు వచ్చానని అంటున్నాడు.
తనకు ఓ రచయిత లేక దర్శకుడు కావాలని ఉందని, కానీ, ఇప్పట్లో ఆ ప్రయత్నం వద్దని అనుకున్నానని, మొదట సదరు ఛానెల్ అంతు చూద్దామని వచ్చినట్లు చెప్పాడు. 'బిత్తిరి సత్తి తెలంగాణ నుంచి ఎంత దూరం వెళతాడు?' అని ప్రశ్నించాడు. తెలంగాణ గురించి, దేశం గురించి ఆ ఛానెల్ చెడుగా ప్రచారం చేస్తోందని, బిత్తిరి సత్తిని కొట్టేసి ఆ ఛానెల్‌ని మూసేద్దామని వచ్చినట్లు విచిత్రంగా మాట్లాడాడు. నిందితుడి ప్రవర్తనను చూసిన వాళ్లు అతను ఓ ఉన్మాదిలా ఉన్నాడని, మద్యం మత్తులో కూడా ఉన్నాడని అంటున్నారు.