airport: బాలిలో ఎగిసిపడుతోన్న లావా.. ఎయిర్‌పోర్ట్‌లోనే వేలాది మంది!
- ఇండోనేసియాలోని బాలిలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు
- ఇప్పటికి 40వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
- తాత్కాలికంగా మూతబడ్డ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు
- దాదాపు 22 గ్రామాల ప్రజలకు ఇక్కట్లు
ఇండోనేసియాలోని బాలిలో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. బాలిలోని అగంగ్ అగ్నిపర్వతం బద్దలై, లావా ఎగిసిపడుతుండడంతో స్థానికులను భద్రతా సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో అక్కడి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ప్రయాణికులను తరలించేందుకు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నాలు జరుపుతున్నారు.
ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ధూళి, బూడిద అలముకొంది. అగ్నిపర్వతానికి 10 కిలోమీటర్ల వరకు ఎవ్వరినీ ఉండనివ్వకూడదని అధికారులు నిర్ణయించుకున్నారు. అగ్నిపర్వతం పేలుడుతో దాదాపు 22 గ్రామాల ప్రజలు ఇక్కట్లు ఎదుర్కోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఉన్న 40 వేల మందిని ఇప్పటికే తరలించారు. మిగతా వారిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో చిక్కుకున్న పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడి విమానాశ్రయాన్ని మూసివేయడంతో సుమారు 445 విమానాలను రద్దు అయి, 59 వేలమంది ప్రయాణాలు రద్దయ్యాయి.