Supreme Court: ఆధార్ అనుసంధానం గడువును మార్చి 31, 2018 వరకు పొడిగిస్తాం: కేంద్ర ప్రభుత్వం
- 'అన్నింటికీ ఆధార్ అనుసంధానం'పై సుప్రీంకోర్టులో విచారణ
- వివరణ ఇచ్చిన కేంద్ర సర్కారు
- ప్రస్తుతం ఓ విషయంలో కేంద్రం, ఢిల్లీ సర్కారుకి విభేదాలు
- అవి తొలిగిపోయాక ఆధార్ అనుసంధానంపై విచారణ: సుప్రీంకోర్టు
'అన్నింటికీ ఆధార్' అంటూ ప్రజలను కేంద్ర ప్రభుత్వం కంగారు పెడుతోందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. అందుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరపగా పలు పథకాలకు ఆధార్ అనుసంధానానికి గడువును 2018 మార్చి 31 వరకు పొడిగిస్తామని కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. అయితే, ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ చేపట్టే అధికారాలను తమకు బదిలీ చేయాలని కోరుతూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సుప్రీంకోర్డులో వ్యాజ్యాన్ని దాఖలు చేయగా, అది దేశ రాజధాని కాబట్టి అధికారాలన్నీ రాష్ట్ర సర్కారుకి బదిలీచేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం-కేంద్ర ప్రభుత్వాలకు మధ్య విభేదాలు ఉన్నాయని, అవి తొలగిపోయాక సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం అంశంపై తదుపరి విచారణను చేపడతామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ పాలసీ, పీపీఎఫ్ వంటి పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఇటీవలే మొబైల్ నెంబరుతో పాన్ అనుసంధానానికి గడువును 2018 ఫిబ్రవరి 6 వరకు పొడిగించింది. బ్యాంకు ఖాతా, మొబైల్ నెంబర్, పాన్‌తో ఆధార్ అనుసంధానంపై అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్లపై విచారణకు రాజ్యాంగ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు వచ్చేవారం ఏర్పాటు చేయనుంది.