Ivanka Trump: హైదరాబాద్ చేరుకున్న ఇవాంకా.. ఘన స్వాగతం.. చివరి నిమిషంలో బస చేసే హోటల్ మార్పు!
- తెల్లవారుజామున 3.30 గంటలకు భాగ్యనగరంలో అడుగుపెట్టిన ఇవాంకా
- ఘనస్వాగతం పలికిన తెలంగాణ మంత్రులు
- చివరి నిమిషంలో విడిదిలో మార్పు
అందరూ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్‌హౌస్ సలహాదారు అయిన ఇవాంకా ట్రంప్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్‌లోని ట్రైడెంట్ హోటల్‌కు (వెస్టిన్ హోటల్ లో ఆమె బస చేస్తారని మొదట ప్రకటించినప్పటికీ, భద్రత చర్యలలో భాగంగా హోటల్ ను చివరి నిమిషంలో మార్చారు) చేరుకున్నారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖా మంత్రి సుష్మాస్వరాజ్‌తో భేటీ అవుతారు. ఇవాంకా రాక సందర్భంగా నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నేటి మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. మియాపూర్‌లో మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం మోదీ హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకుంటారు. అక్కడ ఆయనను ఇవాంక మర్యాదపూర్వకంగా కలుస్తారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు అనంతరం ఇద్దరూ కలిసి ఫలక్‌నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్‌కు చేరుకుంటారు. తిరిగి రేపు మధ్యాహ్నం ఆమె హెచ్ఐసీసీ నుంచి బయటకు వెళ్తారని తెలుస్తున్నా ఎక్కడికి వెళ్తారన్న విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. రాత్రి 9.20 గంటలకు దుబాయ్ బయలుదేరుతారు.