Hyderabad: ఒళ్లంతా కళ్లు చేసుకున్న పోలీసులు.. ఈ 42 గంటలూ పోలీసులకు కీలకం!
- ఇవాంకా, మోదీ రాక నేపథ్యంలో నగరంలో పటిష్ట భద్రత
- ఆ 42 గంటలూ తమకు కీలకమన్న పోలీసు అధికారులు
- ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న వైనం
ఇవాంకా ట్రంప్ భాగ్యనగరంలో అడుగుపెట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ నగరానికి చేరుకోనున్నారు. వీరిద్దరి పర్యటనతో నగర పోలీసులకు కంటిమీద కునుకు కరువైంది. ముఖ్యంగా ఇవాంకా నగరంలో ఉండే 42 గంటలు తమ సర్వీసులోనే చాలా కీలకమైనవని పోలీసులు చెబుతున్నారు. ఆమె భద్రత కోసం పోలీస్ వ్యవస్థ మొత్తం రంగంలోకి దిగింది. వీరికి అదనంగా అమెరికా సీక్రెట్ సర్వీస్, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎస్‌పీజీ అధికారులు భద్రతా ఏర్పాట్లలో తలమునకలయ్యారు.
ప్రధాని మోదీ, ఇవాంకా ట్రంప్ పర్యటించే ప్రాంతాల్లో భద్రత పర్యవేక్షణను స్వయంగా ఉన్నతాధికారులే చూస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయ బాధ్యతను సీఐడీ ఐజీ షికాగోయల్ నిర్వహిస్తున్నారు. అదనపు డీజీ (శాంతిభద్రతలు) అంజనీకుమార్ కూడా షికా గోయల్‌తో కలవనున్నారు. అలాగే డీజీపీ మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతూ లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇవాంకా తిరిగి అమెరికా చేరుకునే వరకు తమకు నిద్ర కూడా ఉండదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇవాంకా ట్రంప్ నగరంలో ఉండే 42 గంటలూ తాము అప్రమత్తంగా ఉంటామని, పొరపాట్లకు తావివ్వబోమని అంటున్నారు.