Hyderabad: ఇక మెట్రో మార్గంలో అడ్రస్ కనుక్కోవడం బహుసులువు!
- భాగ్యనగరిలో కొత్త చిరునామా... ఎంవైపీ-34, కేపీహెచ్బీ-20
- మెట్రో స్తంభాల నంబర్లే అడ్రస్
- ఏ ప్రాంతానికి ఆ ప్రాంతపు కోడ్ తో పియర్లకు సంఖ్యలు
మీరు హైదరాబాద్ కు కొత్తగా వచ్చారా? నాగోల్ లేదా బేగంపేట... కాకుంటే అమీర్ పేట, కూకట్ పల్లి... ఇలా మెట్రో రైలు ప్రయాణించే మార్గంలో చిరునామా తెలుసుకోవడం ఇకపై మరింత సులువు కానుంది. మెట్రో పియర్లకు వేసిన నిర్దేశిత నంబర్ల సాయంతో ఎంచక్కా అడ్రస్ కనుక్కోవచ్చు. ఇప్పటికే మియాపూర్ నుంచి ఎల్బీనగర్, నాగోల్ నుంచి అమీర్పేట కారిడార్లలో పియర్ల నిర్మాణం పూర్తి కాగా, ఒక్కో పియర్ కు ఒక్కో నంబర్ ను కేటాయించారు.
ఉదాహరణకు మియాపూర్ తొలి పియర్ కు ఎంవైపీ-01/ఏ అని ఉంటుంది. రెండో పియర్ కు ఎంవైపీ-02/ఏ... ఇలా వెళుతుంటాయి. ఎంవైపీ అంటే మియాపూర్. ఇక మియాపూర్ దాటగానే కూకట్ పల్లి స్టేషన్ తొలి పియర్ కే 'కేపీహెచ్బీ' సంఖ్య మొదలవుతుంది. అట్లానే అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట, కోటి, మాదాపూర్... ఇలా మెట్రో పియర్ లు పూర్తయిన ప్రతి చోటా ఈ నంబర్ లు ఉన్నాయి.
వాస్తవానికి ఇవి మెట్రో రైల్ నిర్మాణ కార్మికులు సులువుగా తాము పనిచేసే ప్రాంతానికి వెళ్లేందుకు వేసుకున్నా, ఇప్పుడవి హైదరాబాదీలకు నూతన చిరునామాగా మారాయి. ఫలానా ప్రాంతంలోని పియర్ నంబర్ వద్ద కలుద్దామని చెప్పుకుంటున్న వారు, అక్కడికి వచ్చి కలవాలని అనేవారు ఇప్పుడు భాగ్యనగరంలో కోకొల్లలు.