donkeys: ఉత్తరప్రదేశ్ లో జైలు శిక్ష ముగించుకుని బయటకు వచ్చిన ఎనిమిది గాడిదలు!
- ఖరీదైన మొక్కలను తింటున్నాయని కేసు
- జైలు శిక్ష విధించిన న్యాయమూర్తి
- బెయిల్ కు డబ్బు కట్టిన స్థానిక నేత
- నాలుగు రోజుల తరువాత బాహ్య ప్రపంచంలోకి
ఉత్తరప్రదేశ్ లో ఓ కోర్టు విధించిన నాలుగు రోజుల జైలు శిక్ష అనంతరం ఎనిమిది గాడిదలు, తిరిగి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. ఈ గాడిదలు జైలు ఆవరణలోకి ప్రవేశించి కొన్ని లక్షల విలువ చేసే ఖరీదైన మొక్కలను తిన్నాయన్న అభియోగాలపై, విచారించిన జులాన్ జిల్లా కోర్టు, నాలుగు రోజుల జైలు శిక్షను విధించగా, ఆ శిక్షను అధికారులు అమలు చేశారు. గాడిదలు జైల్లోకి వెళుతున్నప్పుడు ఉన్న పరిస్థితి ఏంటోగానీ, అవి బయటకు వచ్చేలోగా, విషయం మీడియాకు ఎక్కి ఆ గాడిదలు సెలబ్రిటీలుగా మారాయి.
జైలు ఆవరణలోకి వస్తున్న గాడిదలు, మొక్కలను తింటున్నాయని, వాటిని జైలులోకి తోలవద్దని యజమానికి ఎన్నిసార్లు చెప్పినా వినలేదని, అందుకే ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక ఈ గాడిదలకు ఎంతకాలం పాటు జైలు శిక్ష విధించారన్న విషయం తెలియరాలేదుగానీ, ఓ స్థానిక రాజకీయ నాయకుడు, వాటికి బెయిల్ ఇచ్చేందుకు డబ్బులు కట్టగా, వాటిని విడుదల చేసినట్టు జైలు అధికారులు వెల్లడించారు.