aiadmk: అన్నాడీఎంకేలో మళ్లీ ఆధిపత్య పోరు.. ఆర్కే నగర్ అభ్యర్థి ఎంపికలో గందరగోళం!
- చిచ్చు రేపిన ఆర్కే నగర్ ఉపఎన్నికలు
- అభ్యర్థి ఎంపికలో విభేదాలు
- తుది నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సమావేశం
పళనిస్వామి, పన్నీర్ సెల్వం లు చేతులు కలిపిన తర్వాత అన్నాడీఎంకేలో విభేదాలు తొలగిపోయాయి. తాజాగా, ఆర్కే నగర్ ఉపఎన్నిక షెడ్యూల్ పార్టీలో మళ్లీ ఆధిపత్య పోరుకు బీజం వేసింది. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థి ఎంపిక విషయమై నిన్న అన్నాడీఎంకే కార్యనిర్వాహక మండలి సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి పళని వర్గం, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ వర్గీయుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయి. మధుసూదన్ ను అభ్యర్థిగా ఎంపిక చేసే విషయంలో పన్నీర్ వర్గం రెండుగా చీలిపోయింది. ఓ వర్గం ఆయనకు మద్దతు ప్రకటించగా, మరో వర్గం వ్యతిరేకించింది. పళనిస్వామి వర్గం గోకుల ఇందిరను తెరపైకి తీసుకొచ్చింది. ఈ సమావేశానికి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఇద్దరూ హాజరయ్యారు.
వంద మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. చర్చల సందర్భంగా మధుసూదన్ తో పాటు మునుస్వామి పేర్లను పన్నీర్ వర్గం ప్రతిపాదించింది. మునుస్వామి కూడా తనకు ఆర్కే నగర్ సీటు ఇవ్వాలని పట్టుబట్టాడు. తాను ఎన్నికల్లో పోటీ చేస్తే... గెలుపు ఖాయమని, తనకున్న అనుభవంతో మంత్రి పదవి చేపట్టి, మెరుగైన సేవలు అందించగలుగుతానని చెప్పారు.
మరోవైపు, మధుసూదన్ మాత్రం మౌనం వహించారు. పళనిస్వామి వర్గం ఈ సారి యువతకు అవకాశం ఇద్దామని... గోకుల ఇందిరకు టికెట్ ఇద్దామని ప్రతిపాదించింది. ఈ క్రమంలో, సమావేశంలో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో, అభ్యర్థి ఎంపికను ఈనెల 29కి వాయిదా వేశారు. దీనికి తోడు, పాలకమండలిలో పదవుల భర్తీ అంశంపై కూడా విభేదాలు తలెత్తాయి.
ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి హోదాలో పళనిస్వామికి, మునుస్వామికి, వైద్యలింగంకు, మాజీ మంత్రి వలర్మతికి మండలిలో స్థానం కల్పించారు. దీంతో, ఐదుగురు సభ్యులున్న పాలకమండలి ఒకేసారి తొమ్మిదికి పెరిగింది.