chandimal: రెండో టెస్టులో మా ఓటమికి కారణం ఇదే: శ్రీలంక కెప్టెన్ చండిమల్
- తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులైనా చేసి ఉండాల్సింది
- ప్రత్యర్థిని ఢీకొనాలంటే ఫస్ట్ ఇన్నింగ్స్ లో మంచి స్కోరు ఉండాలి
- మా గేమ్ ప్లాన్ ను అమలు చేయలేకపోయాం
భారత్ తో జరిగిన రెండో టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో శ్రీలంక ఘోర ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మెన్లు, రెండో ఇన్నింగ్స్ లో భారత బౌలర్ల ధాటికి లంక విలవిల్లాడింది. మ్యాచ్ అనంతరం ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చండిమల్ మాట్లాడుతూ, ఓటమిపై ఆవేదన వ్యక్తం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో తాము కనీసం 400 పరుగులైనా చేసి ఉండాల్సిందని చెప్పాడు.
తొలి ఇన్నింగ్స్ లో మంచి స్కోరు ఉంటేనే... ప్రత్యర్థిని ఢీకొనగలమని అన్నాడు. తాము నలుగురు బౌలర్లను మాత్రమే ఎదుర్కొన్నామని... వారితో కనీసం మూడు స్పెల్స్ అయినా వేసేలా చేసి ఉంటే, వాళ్లు అలసి పోయేవారని... దీంతో, ఐదో బౌలర్ బరిలోకి దిగేవాడని చెప్పాడు. వాస్తవానికి తమ గేమ్ ప్లాన్ ఇదేనని... కానీ, దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యామని తెలిపాడు. భారత్ అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన చేసిందని కితాబిచ్చాడు.