ivanka: 'ఇవాంకా... దయచేసి సికింద్రాబాద్‌కి రా'... రోడ్లు బాగోలేకపోవడంపై స్థానికుల వినూత్న నిరసన
- ప్లకార్డులు, పోస్టర్లతో ప్రచారం
- మద్దతు తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తలు
- ఖండించిన జీహెచ్ఎంసీ
ఇవాంకా ట్రంప్ అడుగు పెట్టబోతున్న ప్రాంతాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. అయితే ఆమె సందర్శించని ప్రాంతాల పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన వాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వీరంతా 'ఇవాంకా... దయచేసి సికింద్రాబాద్‌కి రా' అని ప్లకార్డులు పట్టుకుని సంగీత్ క్రాస్‌రోడ్స్ వద్ద వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కనీసం ఇవాంకా సందర్శిస్తేనైనా తమ ప్రాంతం బాగుపడుతుందేమోనని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరి నిరసనలకు గల కారణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఖండించారు. ఇవాంకా ట్రంప్ సందర్శించని ప్రాంతాలను కూడా బాగు చేసేందుకు ప్రభుత్వం చాలా డబ్బులు ఖర్చు పెట్టిందని జీహెచ్ఎంసీ చీఫ్ ఇంజినీర్ మహ్మద్ జియావుద్దీన్ అన్నారు.