voting right: ఓటు నమోదు అవగాహన కోసం ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం
- సోషల్ మీడియా వారధిగా ప్రచారం
- 18 ఏళ్లు నిండిన వారందరికీ సందేశం
- ఒక్క క్లిక్‌తో ఓటు నమోదు ప్రక్రియ
ఓటు హక్కు నమోదు గురించి అవగాహన పెంపొందించడం కోసం కేంద్ర ఎన్నికల సంఘం, సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌తో ఒప్పందం చేసుకుంది. యువత ఎక్కువ సమయం కేటాయించే ఫేస్బుక్ ద్వారా ఓటు హక్కు నమోదు ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం కలగనుంది. దీని ద్వారా 18 ఏళ్లు నిండిన యువతకు పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు ఓటు నమోదు చేసుకోవాలనే మెసేజ్ వెళ్తుంది.
ఈ మెసేజ్ మీద క్లిక్ చేయగానే ఓటర్స్ సర్వీసెస్ పోర్టల్‌కు అనుసంధానం అవుతుంది. అక్కడ వివరాలు నమోదు చేస్తే ఒక్క క్లిక్‌తో ఓటు హక్కు నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఈ మెసేజ్ తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌తోపాటు 13 భాషల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది ఇప్పటికే 18 ఏళ్లు పూర్తి చేసుకొన్న, పైబడిన వారందరికి ఈనెల 30న ఇదే సందేశాన్ని మరోసారి గుర్తుచేయనుంది.