Hyderabad: ప్రారంభమైన మెట్రో పరుగులు.. తొలి టికెట్ కొన్న ప్రయాణికుడికి అధికారుల కానుక!
- నాగోల్ నుంచి అమీర్‌పేట చేరుకున్న తొలి రైలు
- మియాపూర్ నుంచి అమీర్ పేటకు చేరిన మరో రైలు
- సెల్ఫీలతో సందడి చేసిన ప్రయాణికులు
హైదరాబాదీయుల చిరకాల స్వప్నం సాకారమైంది. హైదరాబాద్‌లో మెట్రో పరుగులు ప్రారంభమైంది. ఈ ఉదయం ఆరు గంటలకు తొలి కూత పెట్టింది. తొలి టికెట్ కొన్న వ్యక్తికి అధికారులు బహుమతి ఇచ్చి అభినందించారు. ఆరు గంటలకు నాగోల్‌లో ప్రారంభమైన రైలు అమీర్‌పేటకు చేరుకోగా, మియాపూర్‌లో బయలుదేరిన రైలు అమీర్‌పేట చేరుకుంది. మెట్రో రాకతో నాగోలు నుంచి అమీర్‌పేటకు ప్రయాణ దూరం 42 నిమిషాలకు తగ్గిపోయింది.
మెట్రోలో ప్రయాణించిన తొలి ప్రయాణికుల ముఖాల్లో ఆనందం కనిపించింది. తొలి ప్రయాణం అనుభవం దక్కినందుకు ఉబ్బితబ్బిబ్బయ్యారు. సెల్ఫీలతో తొలి జ్ఞాపకాన్ని పదిలపరుచుకున్నారు.
మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు నడవనున్నాయి. రెండు మార్గాల్లో పది చొప్పున మొత్తం 20 రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ప్రతీ పదిహేను నిమిషాలకో రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. మెట్రో రైలుకు మొత్తం మూడు కోచ్‌లు ఉండగా ఒక్కో దాంట్లో దాదాపు 330 మంది వరకు ప్రయాణించే వీలుంది. అంటే ఒకేసారి వెయ్యి మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ లెక్కన రోజుకు మూడు లక్షమంది వరకు ప్రయాణిస్తారని అంచనా.
ప్రయాణికుల రద్దీని బట్టి రైళ్ల ట్రిప్పులు పెరిగే, తగ్గే అవకాశాలున్నాయి. అలాగే కోచ్‌లను కూడా పెంచే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. మెట్రో ప్రయాణించే రెండు మార్గాల్లో మొత్తం 24 స్టేషన్లు ఉన్నాయి. రైలు కనీస చార్జీ పది రూపాయలు కాగా, గరిష్ట చార్జీ రూ.60.