Narendra Modi: తానేమీ మెట్రో రైలు డ్రైవర్ ను కాదంటూ జోకేసి, నవ్వులు పూయించిన నరేంద్ర మోదీ!
- లోకో పైలెట్ క్యాబిన్ ను చూస్తారా?
- ప్రధానిని ప్రశ్నించిన మెట్రో ఎండి
- నేను నడపాల్సింది రైలును కాదన్న మోదీ
- దేశాన్ని నడిపించాల్సి వుందని వ్యాఖ్య
హైదరాబాద్ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం, దానిలో ప్రయాణించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఉల్లాసంగా కనిపించడంతో పాటు తన చుట్టూ ఉన్నవారితో జోకులేశారు. 57 మెట్రో రైళ్లలో మహిళలను లోకో పైలెట్ లుగా నియమించామన్న విషయాన్ని చెప్పిన ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద నింబార్గి, "లోకో పైలెట్ ఉన్న ఇంజిన్ క్యాబిన్‌ను పరిశీలిస్తారా?" అని మోదీని అడుగగా, ఆయన తనదైన శైలిలో స్పందించారు.
"నేను నడపాల్సింది మెట్రో రైలును కాదు. దేశాన్ని ముందుకు నడిపించాలి" అని అన్నారు. ప్రధాని మాటలతో అక్కడ నవ్వులు విరిశాయి. ఆపై అభివృద్ధి పనుల కోసం జీహెచ్ఎంసీ తరఫున రూ. 1000 కోట్ల నిధులను బాండ్ల ద్వారా సేకరించనున్నామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించగా, తాము 1999లోనే అహ్మదాబాద్ అభివృద్ధి కోసం రూ. 1000 కోట్లను సేకరించామని గుర్తు చేశారు. ఆ అభివృద్ధి పనులను ప్రజలు గుర్తుంచుకున్నారు కాబట్టే, వరుసగా అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. సబర్మతీ నదిలానే మూసీ నదిని కూడా అభివృద్ధి చేయాలని సూచించిన మోదీ, విమానాశ్రయం వరకూ మెట్రో సౌకర్యం ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు.