Robo Mitra: మోదీ, ఇవాంకా మధ్యలో రోబో 'మిత్ర'... ఓ చిన్న కన్ఫ్యూజన్ వీడియో చూడండి!
- బెంగళూరు సంస్థ తయారు చేసిన రోబో 'మిత్ర'
- సదస్సును ప్రారంభించే వేళ అయోమయానికి గురైన 'మిత్ర'
- అతిథులను పలకరించడంలో కన్ ఫ్యూజన్!
బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ ఒకటి తయారు చేసిన దేశవాళీ రోబో 'మిత్ర' ప్రస్తుతం జీఈఎస్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక, సదస్సును నిన్న ప్రారంభించే సమయంలో 'మిత్ర' కాస్త కన్ ఫ్యూజ్ అయింది. 'మిత్ర'ను పరిచయం చేసిన తరువాత ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య నరేంద్ర మోదీ, ఇవాంకా ట్రంప్ వద్దకు వచ్చిన వేళ ఇది జరిగింది.
సదస్సును ప్రారంభించేలా ముందే సెట్ చేసిన ప్రోగ్రామ్ లో భాగంగా తొలుత నరేంద్ర మోదీ, ఆపై ఇవాంకా ట్రంప్, 'మిత్ర' పై ఉన్న టచ్ స్క్రీన్ పై ఉన్న భారత్, అమెరికా జాతీయ పతాకాలను తాకాల్సి వుంది. భారత త్రివర్ణ పతాకాన్ని తాకాలని వ్యాఖ్యాత కోరుతుండగానే, టచ్ స్క్రీన్ పై ఉన్న జెండాలను ఇద్దరూ ప్రెస్ చేశారు. దీంతో ఎవరికి వెల్ కం చెప్పాలో అర్థంగాని 'మిత్ర'... కొంత అయోమయానికి గురై "వెల్ కం మిస్ ఇవాంకా... వెల్ కం మిస్ ఇవాంకా... వెల్ కం శ్రీ నరేంద్ర మోదీ" అంటూ వ్యాఖ్యానించి వెళ్లిపోయింది. వాస్తవానికి నరేంద్ర మోదీ జెండాను తాకగానే, "వెల్ కం శ్రీ నరేంద్ర మోదీ" అని, ఇవాంకా ట్రంప్ అమెరికా ఫ్లాగ్ ను తాకగానే "వెల్ కం మిస్ ఇవాంకా" అని రోబో చెప్పాల్సివుంది. 'మిత్ర' కొద్దిగా కన్ ఫ్యూజ్ అయిన వీడియోను మీరూ చూడండి.